విజయవాడ నగరానికి పూర్వవైభవం తీసుకురావడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) తెలిపారు. నగర అభివృద్ధికి మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లందరూ సమన్వయంతో పనిచేస్తారని పేర్కొన్నారు.

విజయవాడ నగరపాలక సంస్థలో నూతనంగా ఎన్నికైన మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ వంగవీటి రాధా, డిప్యూటీ మేయర్‌ చెన్నుపాటి కాంతిశ్రీలకు అభినందనలు తెలిపారు. అనంతరం నూతన ప్రజాప్రతినిధులతో కలిసి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు చారిత్రాత్మక మెజారిటీ అందించడం తమపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయవాడను రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా పదవి

చెన్నుపాటి కాంతిశ్రీకి డిప్యూటీ మేయర్‌ పదవి కేటాయించడం వెనుక ఆమె కుటుంబం పార్టీకి చేసిన సేవలు, పోరాట స్ఫూర్తి ఉన్నాయని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చెన్నుపాటి కుటుంబానికి పార్టీతో విడదీయలేని అనుబంధం ఉందని, తరతరాలుగా అంకితభావంతో పనిచేస్తోందని కొనియాడారు.

2019–2024 మధ్య ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక ఇబ్బందులు, రాజకీయ వేధింపులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఈ క్రమంలో చెన్నుపాటి కాంతిశ్రీ భర్త, సీనియర్‌ నాయకుడు గాంధీ రాజకీయ కక్ష సాధింపు దాడిలో ఒక కన్ను కోల్పోవడం బాధాకరమన్నారు. అయినప్పటికీ ఆ కుటుంబం వెనుకడుగు వేయకుండా పార్టీ కోసం ధైర్యంగా పోరాడిందని ప్రశంసించారు. పార్టీ పట్ల వారి నిబద్ధత, కష్టకాలంలో అందించిన సేవలకు గుర్తింపుగానే కాంతిశ్రీకి డిప్యూటీ మేయర్‌ బాధ్యతలు అప్పగించామని పేర్కొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *