
గత రెండేళ్లుగా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 16న ఢాకాకు వెళ్లాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన స్వదేశ ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ముఖ్యంగా బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్‌లో తన ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లే అంశంపై కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు వెళ్లాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ తిరుగుబాటు నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి, ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. అయితే స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు నిర్దిష్ట తేదీని ప్రకటించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
డిసెంబర్ 16నే ఎందుకు ఎంచుకున్నారు?
1971 డిసెంబర్ 16న పాకిస్థాన్ పాలన నుంచి బంగ్లాదేశ్ విముక్తి పొందింది. ఈ చారిత్రక విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది డిసెంబర్ 16న అక్కడ విక్టరీ డే (విజయ దినోత్సవం) నిర్వహిస్తారు. అలాంటి కీలకమైన రోజునే షేక్ హసీనా స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమంలో హసీనా తండ్రి, దేశ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ కీలక పాత్ర పోషించారు. ఆయనను బంగబంధు అని కూడా పిలుస్తారు. ఈ నేపథ్యంలో విక్టరీ డే సందర్భంగా హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలని యోచిస్తున్నట్లు ఆమె అధికార ప్రతినిధి సయ్యద్ మొజమ్మెల్ అలీ మంగళవారం రాయిటర్స్‌కు వెల్లడించారు.
షేక్ హసీనా దాదాపు 15 ఏళ్ల పాటు బంగ్లాదేశ్ ప్రధానిగా కొనసాగారు. అయితే 2024లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్లో భారత్‌కు చేరుకున్నారు. అప్పటి నుంచి అంటే 2024 ఆగస్టు 5 నుంచి భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీపై కూడా నిషేధం విధించారు.
తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి
భారత్ రాజధాని ఢిల్లీ నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లేందుకు బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణ ఏర్పాట్లు చేయాలని షేక్ హసీనా ఆ దేశ ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. తాను స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వంపైనే ఉందని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
మరోవైపు హసీనా భారత్‌కు వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెకు సంబంధించిన పలు అధికారిక పత్రాలను రద్దు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు అవసరమైన బంగ్లాదేశ్ పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు (నేషనల్ ఐడెంటిటీ కార్డు)లను తిరిగి జారీ చేయాలని ఆమె కొన్ని వారాల క్రితమే బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది.
షేక్ హసీనాకు అవసరమైన అధికారిక పత్రాలను తిరిగి జారీ చేయాలని కోరుతూ ఆమె తరఫున న్యాయ ప్రతినిధులు నవంబర్ 9న న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషనర్‌ను సంప్రదించినట్లు సమాచారం. అనంతరం తమ దరఖాస్తు ప్రస్తుత స్థితిపై వివరాలు కోరుతూ హసీనా సంతకంతో కూడిన అధికార లేఖను కూడా పంపించినట్లు తెలుస్తోంది.
అయితే హసీనాకు కొత్త పాస్‌పోర్టు జారీ చేసే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం. ఆమె అభ్యర్థనకు చట్టపరమైన ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారమే ఆమె స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంటుందని ఢాకా వెల్లడించింది.
ఇదిలా ఉంటే, షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికే భారత్‌ను అధికారికంగా కోరింది. ఈ అభ్యర్థనను చట్టపరమైన ప్రక్రియ ప్రకారం పరిశీలిస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది.
హసీనాకు మరణశిక్ష విధించిన బంగ్లాదేశ్ ట్రిబ్యునల్
షేక్ హసీనా భారత్‌కు వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌లో ఆమెపై పలు తీవ్ర ఆరోపణలతో న్యాయ విచారణ చేపట్టారు. 2024లో హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలను అప్పటి ప్రభుత్వం అణచివేసిందని, ఈ క్రమంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి ఆమె బాధ్యురాలని అభియోగాలు నమోదయ్యాయి.
ఈ కేసులను విచారించిన బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ 2025 నవంబర్‌లో షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను, ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ విచారణ రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపించారు.
మరోవైపు, హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తే వెంటనే అరెస్ట్ చేస్తామని అక్కడి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా డిసెంబర్ 16న బంగ్లాదేశ్ విజయ దినోత్సవం సందర్భంగా స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆమె భావిస్తున్నట్లు వచ్చిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది. హసీనా నిర్ణయం బంగ్లాదేశ్ రాజకీయాలతో పాటు దక్షిణాసియా ప్రాంతంలోనూ చర్చనీయాంశంగా మారింది.



