D Spiritual: Nov 24: వశిష్ఠ గోదావరిలో పుణ్యస్నానాలు.. కార్తీక దీపాలతో దేదీప్యమానంగా మారిన నదీతీరం!

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో భక్తులు పెద్ద సంఖ్యలో వశిష్ఠ గోదావరి తీరానికి తరలివచ్చారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే నదీతీరానికి చేరుకున్న భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో వలంధర రేవు, శివాలయం రేవు, ఫెర్రీ రేవులు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీతీరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

పుణ్యస్నానాలు, దీపారాధనలతో గోదావరి తీరం సందడి

నర్సాపురం, పాలకొల్లు, మొగల్తూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వశిష్ఠ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం రేవుల వద్ద కార్తీక పూజలు నిర్వహించి దీపాలను వెలిగించి నదిలో వదిలారు. నదిలో తేలియాడుతున్న దీపాల కాంతులతో గోదావరి తీరం ఎంతో మనోహరంగా కనిపించింది. వలంధర రేవులోని ఆంజనేయస్వామి, శివుడి విగ్రహాల వద్ద భక్తులు ప్రత్యేక దీపారాధనలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

శివాలయాల్లో ప్రత్యేక పూజలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా నర్సాపురంలోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నదీతీరంలోని పార్వతీ అమరేశ్వరస్వామి ఆలయం, పెద్ద శివాలయం, శారదా హాలులోని శివాలయం, రుస్తుంబాద శివాలయంతోపాటు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాలు శివనామస్మరణతో మార్మోగాయి. భక్తులు ‘ఓం నమఃశివాయ’ అంటూ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

కార్తీక పూజలకు అనువుగా రేవుల అభివృద్ధి

గతంలో అస్తవ్యస్తంగా ఉన్న నర్సాపురం గోదావరి నదీతీరం, రేవులను కార్తీక పూజలకు అనువుగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ చైర్‌పర్సన్ కొత్తపల్లి శైలజ జానకిరామ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రేవుల వద్ద పరిశుభ్రత పనులు చేపట్టడంతోపాటు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. వీధి దీపాలు, వలంధర రేవులో ప్రత్యేక లైటింగ్, జల్లు స్నానాల ఏర్పాట్లు చేశారు. దీంతో భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో పుణ్యస్నానాలు ఆచరించి, పూజలు నిర్వహించుకుని నదిలో దీపాలు వదిలారు.

మున్సిపల్ చర్యలపై పట్టణ ప్రజల హర్షం

మున్సిపల్ చైర్‌పర్సన్ బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలంలోనే భక్తుల ఇబ్బందులను గుర్తించి రేవుల వద్ద అవసరమైన వసతులు కల్పించడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న గోదావరి పుష్కరాల నాటికి నదీతీరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి తీరంలో కనిపించిన దీపాల వెలుగులు, భక్తుల సందడి నర్సాపురంలో పండుగ వాతావరణాన్ని నింపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *