కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి గిరిప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా మొదలైంది.
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి గిరిప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా మొదలైంది. ఈరోజు(మంగళవారం) ఉదయం స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిలో కొండ దిగువన తొలి పావంచాల వద్దకు తీసుకొచ్చారు. ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించారు. ఆపై వైదిక బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత గిరిప్రదక్షిణ మహోత్సవం ప్రారంభమైంది. ఈ మహోత్సవాన్ని దేవస్థానం ఛైర్మన్ రోహిత్, ఈవో చక్రధర్ రావు, ఆర్జేసీ త్రినాథరావు.. టెంకాయ కొట్టి ప్రారంభించారు. గిరిప్రదక్షిణకు దాదాపు 1.50 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. సత్యదేవుని నామస్మరణతో సత్యగిరిలు మార్మోగాయి.

దాదాపు 8.2 కిలోమీటర్ల మేర ఈ గిరిప్రదక్షిణ సాగనుంది. ఈ మార్గంలో 3.9 కిలోమీటర్లు తారు రోడ్డు కాగా, మిగిలిన 4.3 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్డు ఉంది. దీంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గ్రావెల్ మార్గాన్ని చదును చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. గిరిప్రదక్షిణ జరిగే ప్రాంతంలో పలుచోట్ల తాగునీటి కేంద్రాలతో పాటు అల్పాహారం, ఆహార పంపిణీ స్టాళ్లను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. అలాగే భక్తులకు అత్యవసర చికిత్స కోసం ప్రత్యేక వైద్య శిబిరాలతో పాటు, అంబులెన్స్‌లను సిద్ధం చేశారు.




