తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నవంబర్ 24న సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైలు నవంబర్ 24న సాయంత్రం 4.15 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

రాయలసీమ మీదుగా ప్రయాణించే ఈ రైలు మార్గమధ్యంలో మొత్తం 14 స్టేషన్లలో ఆగనుంది. ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అదనపు ప్రయాణ సౌకర్యం కల్పించడమే ఈ ప్రత్యేక రైలు నిర్వహణ ఉద్దేశమని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, నల్గొండ, మెదక్ వంటి చుట్టుపక్కల జిల్లాల భక్తులు కూడా హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లకు చేరుకుని అక్కడి నుంచి రైళ్లలో తిరుపతికి ప్రయాణిస్తుంటారు. మరికొందరు బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్, సొంత వాహనాలను ఆశ్రయిస్తారు.

అయితే ప్రయాణ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఎక్కువ మంది రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తిరుపతికి పలు రైళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. భక్తుల సంఖ్యకు అనుగుణంగా రైళ్ల సదుపాయం సరిపోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సెలవులు, పండుగలు, రద్దీ సమయాల్లో రైళ్లలో టికెట్లు దొరకడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తిరుపతికి అదనపు రైళ్లు నడపాలని భక్తులు కోరుతున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు పలుమార్లు విజ్ఞప్తులు కూడా చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా భక్తుల విజ్ఞప్తులు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును నడపనున్నట్లు ప్రకటించింది. రైలు నంబర్ 070199తో నడిచే ఈ స్పెషల్ ట్రైన్ నవంబర్ 24న సాయంత్రం 4.15 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

14 స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం

ఈ ప్రత్యేక రైలుకు మార్గమధ్యంలో మొత్తం 14 స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం కల్పించారు. అవి లింగంపల్లి, వికారాబాద్, రాయచూర్, ఆదోని, గుంతకల్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, ములకలచెరువు, మదనపల్లె రోడ్డు, కలికిరి, పీలేరు, పాకాల జంక్షన్.

ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి (CPRO) ఏ. శ్రీధర్ ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక రైలులో చైర్ కార్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఈ ప్రత్యేక రైలు సదుపాయాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి తిరుపతికి ప్రతిరోజూ పలు డైలీ, వీక్లీ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆయా రైళ్ల మార్గం, ప్రయాణ సమయాన్ని బట్టి తిరుపతి చేరుకోవడానికి సుమారు 8 గంటల 25 నిమిషాల నుంచి 15 గంటల వరకు సమయం పడుతోంది.

ప్రధానంగా నారాయణాద్రి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12734), వెంకటాద్రి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12797), రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12794), కృష్ణా ఎక్స్‌ప్రెస్ (17406), శబరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20629), చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ (17652) వంటి రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు వారంలో కొన్ని రోజులు మాత్రమే నడిచే వీక్లీ, ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లే భక్తులకు పలు రైలు ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

వేగవంతమైన ప్రయాణాన్ని కోరుకునే భక్తులకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20701) మరో మంచి ఎంపికగా ఉంది. మంగళవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 6.10 గంటలకు బయలుదేరి, కేవలం 8 గంటల 25 నిమిషాల్లోనే మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

ఇక కాచిగూడ నుంచి కూడా తిరుపతికి పలు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. పద్మావతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12764), సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ (12770), ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (12708) వారంలో మూడు రోజులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌లోని వివిధ రైల్వే స్టేషన్ల నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు ప్రయాణానికి అనుగుణంగా రైళ్లను ఎంచుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *