D Spiritual: Nov 24: వైభవంగా అన్నవరం సత్యదేవుని గిరిప్రదక్షిణ మహోత్సవం ప్రారంభం

అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి గిరిప్రదక్షిణ మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల సత్యదేవుని నామస్మరణతో సత్యగిరులు మార్మోగాయి.

మహోత్సవంలో భాగంగా స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొండ దిగువున ఉన్న తొలి పావంచాల వద్దకు తీసుకువచ్చారు. అనంతరం తిరుచ్చిపై ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి సుందరంగా అలంకరించారు. వైదిక బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.

పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం దేవస్థానం ఛైర్మన్ రోహిత్, ఈవో చక్రధర్ రావు, ఆర్‌జేసీ త్రినాథరావు తదితరులు కొబ్బరికాయ కొట్టి గిరిప్రదక్షిణ మహోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని నామస్మరణలు, భక్తుల కోలాహలంతో అన్నవరం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *