
తెలంగాణలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్లు తొలిసారిగా టీజీ రెరాలో రిజిస్టర్ అయ్యాయి. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి లబ్ధిదారులకు చట్టపరమైన రక్షణ లభించనుంది. నిర్మాణ పనుల్లో జాప్యం, నాణ్యతా లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకుంటే లబ్ధిదారులు రెరా అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.
క్యూఆర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో ఈ ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక్కో ఫ్లాట్‌కు ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందిస్తోంది. మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందిరమ్మ టవర్లు రెరాలో నమోదు కావడంతో నిర్మాణ నాణ్యత, పారదర్శకతపై పర్యవేక్షణకు అవకాశం ఏర్పడింది.
తెలంగాణలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉన్న అర్హులైన వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. మరోవైపు హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల కోసం ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
తాజాగా ఈ ఇందిరమ్మ టవర్లకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA)లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టు తొలిసారిగా రెరాలో నమోదు కావడం విశేషం. దీంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై రెరా పర్యవేక్షణ ఉండనుంది.
నిర్మాణంలో జాప్యం జరిగినా రెరాకు ఫిర్యాదు చేయొచ్చు
ఇందిరమ్మ టవర్ల నిర్మాణంలో జాప్యం జరిగినా, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోయినా, నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకున్నా లబ్ధిదారులు నేరుగా రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులను పరిశీలించిన రెరా అధికారులు సంబంధిత బిల్డర్లకు నోటీసులు జారీ చేసి వివరణ కోరే అవకాశం ఉంటుంది. బిల్డర్లు ఇచ్చే సమాధానాలు సంతృప్తికరంగా లేకపోతే నిబంధనల ప్రకారం జరిమానాలు కూడా విధించవచ్చు.
ఇందిరమ్మ టవర్లకు రెరా రిజిస్ట్రేషన్ పూర్తికావడంతో నిర్మాణ పనుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరగనుంది. ముఖ్యంగా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేద లబ్ధిదారుల ప్రయోజనాలకు చట్టపరమైన రక్షణ లభించనుంది. నిర్మాణ సంస్థలు నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టేలా పర్యవేక్షణకు అవకాశం ఏర్పడింది.
హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఒక్కో నియోజకవర్గంలో నాలుగు టవర్ల చొప్పున నిర్మించనున్నారు. ఒక్కో టవర్‌లో 120 ఫ్లాట్లు ఉండనున్నాయి. ఈ లెక్కన ప్రతి నియోజకవర్గంలో 480 ఫ్లాట్లు నిరుపేద లబ్ధిదారులకు అందుబాటులోకి రానున్నాయి.
ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వం రూ.11 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో రూ.5 లక్షలను ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరించనుంది. మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారులు విడతల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని ప్రభుత్వం నిర్మాణ సంస్థలకు గడువు విధించింది. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసే సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తామని కూడా ప్రకటించింది.
నిర్మాణ సంస్థలపై రెరా పర్యవేక్షణ
హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులకు తాజాగా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) అనుమతులు లభించాయి. నవంబర్ 23న రెరా చైర్మన్ శ్రీనివాసరాజు నుంచి అనుమతి పత్రాలను హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ అందుకున్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులకు రెరా గుర్తింపు లభించడం కీలక పరిణామమని వీపీ గౌతమ్ పేర్కొన్నారు. దీనివల్ల నిర్మాణ సంస్థలపై పర్యవేక్షణ పెరగడంతో పాటు ప్రాజెక్టులపై లబ్ధిదారుల్లో నమ్మకం మరింత బలపడుతుందని తెలిపారు.
ముఖ్యంగా నిర్మాణ నాణ్యత, నిర్ణీత గడువులో ఇళ్ల అప్పగింత, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను నిర్ధారించేందుకు రెరా నమోదు దోహదపడుతుందని ఆయన వెల్లడించారు.
రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్లు, ఏజెంట్లు, నిర్మాణ ప్రాజెక్టుల కార్యకలాపాలను నియంత్రించడంతో పాటు ఇళ్ల కొనుగోలుదారుల హక్కులను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టాన్నే రెరా (RERA)గా పిలుస్తారు.
రెరా నిబంధనల ప్రకారం 500 చదరపు మీటర్లకు మించిన స్థలంలో చేపట్టే ప్రాజెక్టులు లేదా ఎనిమిదికి పైగా ఫ్లాట్లు కలిగిన నిర్మాణాలు తప్పనిసరిగా రెరాలో నమోదు చేసుకోవాలి. అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిధుల్లో కనీసం 70 శాతాన్ని ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఈ నిధులను సంబంధిత ప్రాజెక్టు నిర్మాణ అవసరాలకే వినియోగించాలి.
ఒకసారి ప్రాజెక్టుకు రెరా రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించిన తర్వాత దాని అనుమతులు, నిర్మాణ వివరాలు, పనుల పురోగతి వంటి సమాచారాన్ని అధికారిక టీజీ రెరా వెబ్సైట్లో పరిశీలించవచ్చు. నిర్మాణ పనుల్లో జాప్యం జరిగినా, ఒప్పంద నిబంధనలు ఉల్లంఘించినా లేదా ఇతర సమస్యలు ఎదురైనా కొనుగోలుదారులు రెరా అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఫిర్యాదులను పరిశీలించి నిబంధనల ప్రకారం సంబంధిత నిర్మాణ సంస్థలపై రెరా అధికారులు చర్యలు తీసుకోవచ్చు.




