ఐపీఓల్లో పెట్టుబడులు పెట్టే మదుపరుల అంచనాలను ప్రభావితం చేస్తున్న గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ధరలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలకంగా స్పందించింది. అనధికారికంగా ప్రచురిస్తున్న జీఎంపీ వివరాలను ప్రచారం చేయడం, వాటిని ప్రచురించడం నిలిపివేయాలని మధ్యవర్తులు, మార్కెట్ వర్గాలకు సూచించింది. ఈ ధరలు పెట్టుబడిదారుల్లో తప్పుడు అంచనాలను కలిగించే ప్రమాదం ఉందని పేర్కొంటూ అడ్వైజరీ జారీ చేసింది.

జీఎంపీ ధరలకు అధికారిక గుర్తింపు లేదు

సాధారణంగా ఐపీఓ ప్రకటన వెలువడినప్పటి నుంచి కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యే వరకు కొన్ని బ్రోకరేజీ సంస్థలు గ్రే మార్కెట్ ప్రీమియం వివరాలను వెల్లడిస్తుంటాయి. అయితే ఈ ధరలకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ ఉండదు. అంతేకాకుండా గ్రే మార్కెట్‌లో జరిగే లావాదేవీలు సెబీ నియంత్రణ పరిధిలోకి రావు. అందువల్ల అక్కడ పెట్టుబడులు పెట్టే వారికి నియంత్రణ సంస్థ నుంచి ఎలాంటి రక్షణ లభించదు. మోసాలు జరిగినా అధికారికంగా ఫిర్యాదు చేసి పరిష్కారం పొందడం కష్టమవుతుంది.

ఇన్వెస్టర్ల అంచనాలపై ప్రభావం

కొన్ని బ్రోకరేజీ సంస్థలు సామాజిక మాధ్యమాల్లో జీఎంపీ ధరలను ప్రచారం చేస్తున్నాయి. వీటిని కొన్ని వెబ్‌సైట్లు, వార్తాపత్రికలు కూడా ప్రచురిస్తున్నాయి. దీంతో ఐపీఓ షేర్లు లిస్టింగ్ సమయంలో భారీ లాభాలు ఇస్తాయనే అంచనాలు మదుపరుల్లో ఏర్పడుతున్నాయి.

అయితే గ్రే మార్కెట్‌లో చూపించిన ప్రీమియం కంటే తక్కువ ధరకు షేర్లు లిస్ట్ అయిన సందర్భాల్లో పెట్టుబడిదారులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అనధికారిక ధరల ప్రచారం మార్కెట్ పారదర్శకతకు విరుద్ధమని సెబీ అభిప్రాయపడింది. అందుకే జీఎంపీ వివరాల ప్రచురణ, ప్రచారాన్ని నిలిపివేయాలని మార్కెట్ మధ్యవర్తులకు స్పష్టం చేసింది.

జీఎంపీని నమ్మి పెట్టుబడులు పెట్టొద్దు

ఐపీఓల్లో పెట్టుబడులు పెట్టే సమయంలో గ్రే మార్కెట్ ప్రీమియం ధరలను ప్రామాణికంగా తీసుకోవద్దని సెబీ మదుపరులకు సూచించింది. జీఎంపీ అనేది అధికారిక మార్కెట్ ధర కాదని, దానికి ఎలాంటి నియంత్రణపరమైన భద్రత లేదని గుర్తుంచుకోవాలని తెలిపింది.

ఒక ఐపీఓలో పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ ఆర్థిక పరిస్థితి, వ్యాపార నమూనా, ఆదాయ వృద్ధి, అప్పులు, భవిష్యత్తు అవకాశాలు వంటి అంశాలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం గ్రే మార్కెట్‌లో కనిపించే ప్రీమియం ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *