ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పరిశీలించారు. సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలి విడతలో విజయవాడ రూరల్, గన్నవరం, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని 73 గ్రామ పంచాయతీలు 893 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 288 గ్రామ పంచాయతీలు 3,088 వార్డులు ఉన్నట్లు వివరించారు.

ఎన్నికల విధుల కోసం సుమారు 9 వేల మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని పంచాయతీలు వార్డులు ఏకగ్రీవమైనట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని 2,100 సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు.

జిల్లా, కమిషన్ స్థాయిలో ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. సుమారు 600 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించడంతో పాటు సాధారణ పోలింగ్ కేంద్రాల్లోనూ వీడియోగ్రఫీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుందని మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో లైటింగ్ విద్యుత్ అంతరాయం ఏర్పడితే వినియోగించేందుకు పవర్ బ్యాకప్ సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.

ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు లేదా సమస్యలు ఉంటే కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌తో పాటు సంబంధిత రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), ఎంపీడీవోలను సంప్రదించాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *