
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే (PhonePe) దేశీయ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. వాల్‌మార్ట్‌కు చెందిన ఈ సంస్థ వచ్చే ఏడాది మార్చి నాటికి ఐపీఓ (IPO) తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ విలువను రూ.1.2 లక్షల కోట్ల నుంచి రూ.1.5 లక్షల కోట్ల మధ్యగా నిర్ణయించే అవకాశం ఉందని సంబంధిత మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.
రూ.14 వేల కోట్ల వరకు నిధుల సమీకరణ?
ఫోన్‌పే ఐపీఓ ద్వారా సుమారు రూ.12 వేల కోట్ల నుంచి రూ.14 వేల కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో ఉండనుందని సమాచారం. అంటే కంపెనీలో ఇప్పటికే వాటాలు కలిగిన వాటాదారులు తమ షేర్లలో కొంత భాగాన్ని విక్రయించనున్నారు. ఐపీఓకు సంబంధించిన సవరించిన ముసాయిదా పత్రాలను త్వరలోనే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించే అవకాశం ఉంది.
గతంలో ఎందుకు వాయిదా పడింది?
ఫోన్‌పే గత ఏడాది నుంచే స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌కు ప్రయత్నాలు చేస్తోంది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఈక్విటీ మార్కెట్లలో హెచ్చుతగ్గులు, రూపాయి విలువలో ఒడిదొడుకుల కారణంగా ఐపీఓ ప్రక్రియను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
తాజాగా స్థూల ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగుపడటం, విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ భారత మార్కెట్లపై ఆసక్తి చూపడం వంటి పరిణామాలు కంపెనీకి అనుకూలంగా మారాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో సానుకూల వాతావరణం కనిపిస్తుండటంతో ఫోన్‌పే మరోసారి ఐపీఓ ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం.
ఇన్వెస్టర్ల దృష్టి ఫోన్‌పేపై
డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రముఖ సంస్థగా ఎదిగిన ఫోన్‌పే స్టాక్ మార్కెట్లోకి వస్తే పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అయితే కంపెనీ తుది వాల్యుయేషన్, ఐపీఓ పరిమాణం, షేర్ల ధర, ఇష్యూ తేదీలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించిన తర్వాతే ఐపీఓకు సంబంధించిన మరిన్ని వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




