
హైదరాబాద్‌లోని యాపిల్ అభిమానులకు శుభవార్త. నగరంలో ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ తన తొలి అధికారిక రిటైల్ స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. కూకట్‌పల్లిలోని లేక్‌షోర్ మాల్-వై జంక్షన్లో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. డిసెంబర్ 10న సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తెలంగాణలో యాపిల్‌కు ఇదే తొలి రిటైల్ స్టోర్ కాగా.. దేశవ్యాప్తంగా ఏడోది కావడం విశేషం.
కూకట్‌పల్లిలో యాపిల్ స్టోర్
హైదరాబాద్‌లో ఇప్పటికే యాపిల్‌కు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి (R&D), రిటైల్ కస్టమర్ కేర్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా సొంత రిటైల్ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నగరంలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించనుంది. ఈ స్టోర్‌లో ఐఫోన్లు, మ్యాక్బుక్లు, యాపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్‌తో పాటు ఇతర యాపిల్ ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. కొత్త ఉత్పత్తుల ఫీచర్లు, పనితీరును నేరుగా పరిశీలించే అవకాశం కూడా ఉంటుంది.
హైదరాబాద్ సంస్కృతి ప్రతిబింబించే ప్రత్యేక డిజైన్
స్టోర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని యాపిల్ ప్రత్యేకంగా రూపొందించిన బ్యారికేడ్ డిజైన్‌ను ఆవిష్కరించింది. హైదరాబాద్‌కు ఉన్న ‘ముత్యాల నగరం’ గుర్తింపును ప్రతిబింబించేలా ముత్యాల స్ఫూర్తితో ఈ డిజైన్‌ను తీర్చిదిద్దింది. నగర సంస్కృతి, ప్రత్యేకతలకు ప్రాధాన్యం ఇస్తూ స్టోర్ రూపకల్పనలో స్థానిక అంశాలను జోడించింది.
దేశంలో ఏడో యాపిల్ స్టోర్
భారత్‌లో యాపిల్ ఇప్పటికే ముంబయి, దిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, పుణె వంటి నగరాల్లో అధికారిక రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోంది. ముంబయిలోని యాపిల్ బీకేసీ, దిల్లీలోని యాపిల్ సాకేత్ తరహాలో హైదరాబాద్‌లో ఈ స్టోర్‌కు ‘యాపిల్ కూకట్పల్లి’ అని పేరు పెట్టింది. డిసెంబర్ 10 నుంచి అందుబాటులోకి రానున్న ఈ స్టోర్‌తో తెలంగాణలోని యాపిల్ వినియోగదారులకు మరింత చేరువ కావాలని కంపెనీ భావిస్తోంది.



