
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో నాయకత్వ మార్పు చోటుచేసుకోనుంది. గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) కల్యాణ్ కృష్ణమూర్తి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది. సంస్థలో దశాబ్దానికి పైగా పనిచేసిన ఆయన నిష్క్రమణకు గల కారణాలను, చివరి పని దినాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న బాలాజీ త్యాగరాజన్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త సీఈఓను కొన్ని వారాల్లో ప్రకటిస్తామని సంస్థ తెలిపింది.
ఐదేళ్లలో ఐదు రెట్లకు పైగా వృద్ధి
కల్యాణ్ కృష్ణమూర్తి నాయకత్వంలో ఫ్లిప్‌కార్ట్ వ్యాపారం ఐదు రెట్లకు మించి విస్తరించినట్లు కంపెనీ వెల్లడించింది. తదుపరి దశ వృద్ధికి సిద్ధమవుతున్న తరుణంలో ఆయన నిష్క్రమణ సంస్థలో కీలక మార్పుగా భావిస్తున్నారు.
ఫ్లిప్‌కార్ట్‌ను సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ స్థాపించారు. వారు సంస్థ నుంచి తప్పుకున్న అనంతరం 2017 జనవరిలో కల్యాణ్ కృష్ణమూర్తి సీఈఓగా నియమితులయ్యారు. 2018లో గ్రూప్ సీఈఓ బాధ్యతలు చేపట్టారు. అమెజాన్, మీషో వంటి ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురైనా సంస్థ వ్యాపారాన్ని విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
జెనీ సేవల ద్వారా వినియోగదారులను ఆకర్షించడం, ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించడం, క్విక్ కామర్స్ విభాగంలో ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌ను ప్రారంభించడం వంటి వ్యూహాత్మక నిర్ణయాలపై ఆయన హయాంలో దృష్టి సారించారు.
నిష్క్రమణ వెనుక కారణాలపై చర్చ
కల్యాణ్ కృష్ణమూర్తి పదవి నుంచి తప్పుకోవడానికి అసలు కారణం ఏమిటనేది కంపెనీ స్పష్టం చేయలేదు. అయితే సంస్థలో అంతర్గత సమస్యలు, ఐపీఓ ప్రక్రియలో జాప్యం, మాతృ సంస్థ వాల్‌మార్ట్‌తో విభేదాలు వంటి అంశాలు ఆయన నిర్ణయానికి కారణమై ఉండవచ్చని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఫ్లిప్‌కార్ట్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసే అంశంపై వాల్‌మార్ట్ ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ఐపీఓ ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో తమ వద్ద ఉన్న షేర్లను నగదుగా మార్చుకునే అవకాశం లేకపోవడంపై కొంతమంది ఉద్యోగుల్లో అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. గత ఏడాది కాలంలో పలువురు వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సంస్థను వీడటం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
కల్యాణ్ సేవలపై వాల్‌మార్ట్ ప్రశంసలు
కల్యాణ్ కృష్ణమూర్తి సేవలను వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ నికోలస్ ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వాల్‌మార్ట్ కూడా ప్రయోజనం పొందాయని పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధికి ఆయన చేసిన కృషి, నెలకొల్పిన పాలనా ప్రమాణాలకు కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు ఫ్లిప్‌కార్ట్ ప్రయాణంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని కల్యాణ్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. నైతిక విలువలు, సమగ్రత, ఉన్నత స్థాయి పాలనా ప్రమాణాలే సంస్థ ఎదుగుదలకు పునాదిగా నిలిచాయని తెలిపారు.
ఫ్లిప్‌కార్ట్‌తో కల్యాణ్ ప్రయాణం
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభ పెట్టుబడులు పెట్టిన టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్లో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన కల్యాణ్ కృష్ణమూర్తి.. 2016లో ఫ్లిప్‌కార్ట్‌లో చేరారు. అంతకుముందు ఆ పెట్టుబడి సంస్థ తరఫున ఫ్లిప్‌కార్ట్ బోర్డులో ప్రాతినిధ్యం వహించారు. 2013లో కొంతకాలం కంపెనీ తాత్కాలిక చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా కూడా సేవలందించారు.
ఆయన కెరీర్లో అత్యంత కీలక ఘట్టంగా 2018లో వాల్‌మార్ట్‌తో జరిగిన ఒప్పందాన్ని చెప్పుకోవచ్చు. దాదాపు 16 బిలియన్ డాలర్లకు ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ సమయంలో ఫ్లిప్‌కార్ట్ విలువను సుమారు 20.8 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. భారత టెక్నాలజీ రంగంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలిచింది.
కల్యాణ్ నిష్క్రమణతో ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త నాయకత్వం బాధ్యతలు చేపట్టనుంది. రాబోయే రోజుల్లో కొత్త సీఈఓ నియామకం, ఐపీఓ ప్రణాళికలపై సంస్థ తీసుకునే నిర్ణయాలు ఆసక్తికరంగా మారనున్నాయి.




