
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రామాయణ’ సినిమా ట్రైలర్ విడుదల చివరి నిమిషంలో వాయిదా పడింది. ట్రైలర్‌ను నేడు విడుదల చేయాలని భావించినప్పటికీ, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు.
సోషల్ మీడియాలో స్పందించిన ఆయన.. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేసే ప్రణాళికలో భాగంగానే ట్రైలర్ రిలీజ్‌ను వాయిదా వేసినట్లు వెల్లడించారు. భారతీయ సంస్కృతిని ప్రపంచ ప్రేక్షకులకు చేరవేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. సుమారు రూ.4,000 కోట్ల వ్యయంతో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది.
ట్రైలర్ ఆలస్యమైనప్పటికీ, ప్రపంచ స్థాయి గ్రాండ్ లాంచ్ కోసం చిత్రబృందం సన్నాహాలు చేస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

