
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో దాదాపు 7,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విమానాశ్రయం పరిసరాలను 13 ప్రధాన జోన్లు, 89 సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్‌లో 80 నుంచి 100 మంది పోలీసులను మోహరించారు.
మొత్తం భద్రతా ఏర్పాట్లను 30 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ, ఏడీజీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు బందోబస్తు నిర్వహణను సమన్వయం చేస్తున్నారు. సభా ప్రాంగణం, విమానాశ్రయ పరిసరాలు, వీఐపీ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు నిరంతర నిఘా కొనసాగిస్తున్నాయి.
ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం భోగాపురానికి చేరుకోనున్నారు. మంగళగిరి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి, అక్కడి నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం మిరాకిల్ సిటీ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో బస చేయనున్నారు. శనివారం ఉదయం గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రధానమంత్రి మోడీకి స్వాగతం పలికి, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా శుక్రవారం సాయంత్రం విశాఖపట్నానికి చేరుకోనున్నారు. సీఎం అధికారిక సమావేశాల్లో పాల్గొనగా, మంత్రి లోకేష్ నేరుగా భోగాపురానికి వెళ్తారు. శనివారం జరిగే ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి మోడీతో కలిసి ఇద్దరూ పాల్గొంటారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేశాయి.

