
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఇటీవలె 7437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన రాగా.. తాజాగా ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే తేదీలను ఖరారు చేశారు. ఈనెల 19 నుంచి వచ్చే నెల 9 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. కానిస్టేబుల్, ఎస్‌ఐ, ఫైర్‌ఫైటర్, వార్డర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఎస్సై పోస్టుకు రూ.1500, కానిస్టేబుల్ పోస్టుకు రూ.1200 చొప్పున అప్లికేషన్ ఫీజు నిర్ణయించారు.
ఇటీవల పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్), అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి 4 వేర్వేరు నోటిఫికేషన్లను టీఎస్ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో అత్యధికంగా కానిస్టేబుల్ పోస్టులే ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) 3,697.. ఏఆర్ కానిస్టేబుల్ 1,052.. ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ 1,380.. ఫైర్ ఫైటర్ 751.. జైలు వార్డర్ 208 పోస్టులు ఉండగా.. సబ్ ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ జైలర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఏఎస్సై వంటి పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగానే ఫిజికల్, మెడికల్ రూల్స్ చెక్ చేసుకోవాలని టీఎస్ఎల్‌పీఆర్‌బీ అధికారులు సూచించారు. అలాగే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, నాన్ క్రీమీలేయర్, స్థానికత, ఇతర ప్రత్యేక కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఆయా సర్టిఫికెట్లను రెడీగా ఉంచుకోవాలని తెలిపింది.
ఇక.. పరీక్ష ఫీజును ఎస్‌ఐ స్థాయి పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.750.. ఇతర అభ్యర్థులు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. కానిస్టేబుల్, ఫైర్‌ఫైటర్, వార్డర్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీలకు రూ.600.. ఇతరులకు రూ.1,200గా ఫీజు నిర్ణయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు www.tgprb.in అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ఎల్‌పీఆర్‌బీ సూచించింది.

