
విదుర నీతి కేవలం రాజకీయాలకే కాక, ప్రతి వ్యక్తి జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి, నిరాశలను జయించడానికి ఉపయోగపడే గొప్ప మనస్తత్వ శాస్త్రం (Psychology). విదురుని ప్రకారం నిజమైన జ్ఞాని లేదా పండితుడు అంటే లాభ నష్టాలకు, సుఖ దుఃఖాలకు అతిగా స్పందించకుండా తన కర్తవ్యాన్ని నిలకడగా పూర్తిచేసేవాడు. మనిషికి వెలుపలి శత్రువుల కంటే అంతరంగంలో ఉండే సంశయం, నిరాశలే పెద్ద శత్రువులు. విదుర నీతి నుంచి మనం ఎంతో స్పూర్తిని పొందవచ్చు. విదుర నీతి మనకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.
జీవితంలో కష్టపడిన వాడికి ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్న మాట మనం వినే వింటాం. ఇది నిజం. కానీ జీవితంలో తీవ్రంగా శ్రమించినప్పికీ.. కొన్నిసార్లు చాలా మంది ఖాళీ చేతులతో మిగిలిపోయే క్షణాలు వస్తుంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడం, కెరీర్లో ప్రమోషన్ సాధించడం లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం ఇలా ఏ విషయంలోనైనా అనుకున్న ఫలితాలు రానప్పుడు నిరాశ, నిస్పృహలు కలగడం సహజం.
విదుర నీతిలోని ప్రాథమిక సిద్ధాంతం “కర్మ ప్రాధాన్యత”. విదురుని ప్రకారం కేవలం ఫలితాన్ని మాత్రమే మనసులో ఉంచుకుని పనిచేసే వ్యక్తి, విజయం వస్తే అహంకారిగాను, విఫలమైతే కృంగిపోయే వ్యక్తిగాను మారతాడు. నిజమైన కర్మయోగి తన శక్తినంతటినీ పని చేసే ప్రక్రియ పైనే పెడతాడు.
అదృష్టం కలిసిరానప్పుడు, బయటి పరిస్థితుల్ని నిందించడం కంటే మన అంతరంగంలోకి తొంగి చూడాలని విదుర నీతి సూచిస్తుంది. చాలామంది తమ ఓటమికి ఇతరులనో, పరిస్థితులనో బాధ్యుల్ని చేస్తారు. కానీ తెలివైన వ్యక్తి, తన నైపుణ్యాల్లో ఎక్కడ లోపం ఉందో విశ్లేషించుకుంటాడు.

