
మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన టీం స్పందించింది. పర్యాటకం, పెట్టుబడుల ప్రచారం కోసం చిరంజీవిని నియమిస్తున్నారనే వార్తలను ఖండించింది. అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ధృవీకరించని ఫేక్ న్యూస్‌ను, పుకార్లను ఎవరూ నమ్మవద్దని మెగాస్టార్ టీమ్ సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేసింది.
మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నట్లు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలను ఆయన టీమ్ ఖండించింది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ రూమర్స్ అని తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దని కోరింది.
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలని టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన చిరంజీవిని రాష్ట్ర ప్రభుత్వం కోరిందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. గుజరాత్‌ను ప్రమోట్ చేయడంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్ర తరహాలో, ఆంధ్రప్రదేశ్ లో అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా చిరు వ్యవహరించనున్నారని టాక్ నడిచింది. చిరంజీవికి ఉన్న ప్రజాదరణతో పర్యాటకం, పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తోందని, ఇప్పటికే ఆయనతో చర్చలు పూర్తయ్యాయని చెప్పుకున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రచారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి చిరంజీవి సోదరుడు కావడంతో ఈ వార్తలు నిజమేనేమో చాలామంది భావించారు. ఈ నేపథ్యంలో చిరు టీమ్ స్పందించింది. ”మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారనే వదంతులను నమ్మవద్దు. వాటిని ప్రచారం చేయవద్దు. దయచేసి ధృవీకరించని వార్తలను, ఫేక్ న్యూస్ ని షేర్ చేయకండి” అని మెగాస్టార్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్లయింది.

