
స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పాలసీ-2026ను విడుదల చేసింది. రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, వైద్యం, విద్య, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం తదితర రంగాల్లో పీపీపీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు రూ.1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ ప్రాజెక్టుల పైప్‌లైన్ ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.1,500 కోట్ల స్టేట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) ను కేటాయించింది. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైన కీలక మూలధన అంతరాలను ఈ నిధుల ద్వారా భర్తీ చేయనుంది. పీపీపీ ప్రాజెక్టుల ప్రణాళిక, అప్రైజల్, ప్రొక్యూర్‌మెంట్, అమలు, పర్యవేక్షణకు స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రారంభ దశలో ఆర్థికంగా లాభదాయకంగా లేని, అయితే భవిష్యత్తులో ఆదాయాన్ని సమకూర్చే అవకాశమున్న ప్రాజెక్టులకు ‘ప్రాజెక్ట్ వయబిలిటీ బ్రిడ్జి ఫండ్’ ద్వారా వడ్డీలేని రుణాలు అందించే విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది.
ప్రైవేట్ రంగ పెట్టుబడులు, సాంకేతిక నైపుణ్యం, నిర్వహణ సామర్థ్యాలను వినియోగించుకుని మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయడం పాలసీ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. నాణ్యమైన ప్రజా సేవలను అందించడంతో పాటు పెట్టుబడిదారులకు అనుకూలమైన మౌలిక వసతుల వ్యవస్థను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న పీపీపీ విధానాలను పరిశీలించడంతో పాటు సంబంధిత స్టేక్‌హోల్డర్ల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పాలసీ-2026ను రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు ఈ పాలసీని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

