
థాయ్‌లాండ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులతో ఏపీ భవన్ అధికారులు మాట్లాడారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు విద్యార్థుల పరిస్థితిపై అధికారులు ఆరా తీశారు.
విద్యార్థులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు వారికి అవసరమైన సహాయంపై వివరాలను అధికారులు సేకరించారు. విద్యార్థుల పరిస్థితికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని థాయ్‌లాండ్‌లోని భారత రాయబారికి పంపించారు.
స్థానిక కరెన్సీ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఏపీ భవన్ అధికారులు తెలిపారు. వారికి అవసరమైన సహాయం అందేలా థాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు సూచనలు చేయాలని భారత రాయబారిని కోరారు.
అలాగే విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని ఏపీ భవన్ అధికారులు వెల్లడించారు.

