
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం సరికాదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సభకు గైర్హాజరయ్యే ఎమ్మెల్యేల జీతాలను వెనక్కి తీసుకునేలా చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అయితే, దీనిపై కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేల హాజరును పర్యవేక్షించేందుకు ఏపీ అసెంబ్లీలో ప్రత్యేకంగా కెమెరాలను ఏర్పాటు చేసినట్లు స్పీకర్ వెల్లడించారు. ఎమ్మెల్యేలు తమ సీట్లలో కూర్చున్నప్పుడు వారి హాజరు ఆటోమేటిక్‌గా నమోదయ్యే విధంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అదే సమయంలో డీఎస్సీ అంశంపై అనవసర వివాదాలను సృష్టిస్తున్నారని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి అయినా వైఎస్ జగన్‌తో పాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని కోరారు. ప్రజలు తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కారం చూపుతారనే నమ్మకంతోనే ఎమ్మెల్యేలను ఎన్నుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
కొంతమంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినప్పటికీ బయటే సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని స్పీకర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల హాజరును పక్కాగా నమోదు చేసేందుకు అసెంబ్లీలో కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కేటాయించిన సీట్ల వద్ద కెమెరాలను ఏర్పాటు చేశామని, వారు తమ సీట్లలో కూర్చుంటేనే ఆ కెమెరాలు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయని చెప్పారు. సీట్లో కూర్చున్నప్పుడే ఎమ్మెల్యే సభకు హాజరైనట్లు పరిగణిస్తామని స్పష్టం చేశారు.
ఇక ఈ నెల 17న జరిగే బీఏసీ సమావేశంలో చర్చించి అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని అయ్యన్నపాత్రుడు తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేల జీతాలను వెనక్కి తీసుకునేలా పార్లమెంటులో చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ అంశంపై కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదన్నారు. బాధ్యతలను విస్మరించి సభకు హాజరు కాకుండా జీతాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
డీఎస్సీ అంశాన్ని ఉద్దేశపూర్వకంగా వివాదాస్పదం చేయడం సరికాదని స్పీకర్ అన్నారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన వారిని వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ నేతలు తప్పుడు ప్రచారంతో హేళన చేయడం తగదని వ్యాఖ్యానించారు. స్పోర్ట్స్ కోటా అంటే వైఎస్ జగన్‌కు అసలు అవగాహన ఉందా అని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటా కింద జరిగిన నియామకాలపై రికార్డులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే మాట్లాడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రజలకు ప్రభుత్వ పాలన నచ్చకపోతే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలని అయ్యన్నపాత్రుడు అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు.

