
ప్రపంచంలోనే అరుదైన వృక్ష జాతుల్లో ఎర్రచందనం ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల్లో, ముఖ్యంగా శేషాచలం అడవుల్లో ఇది సహజసిద్ధంగా పెరుగుతుంది. ఇక్కడి నేల, వాతావరణ పరిస్థితులు ఎర్రచందనం నాణ్యతకు అనుకూలంగా ఉండటంతో దీనికి అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంది.
ఎర్రచందనాన్ని వాద్య పరికరాలు, దేవతా విగ్రహాలు, అలంకరణ వస్తువులు, గృహోపకరణాల తయారీలో ఉపయోగిస్తారు. చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో దీనికి మంచి మార్కెట్ ఉంది. అందుకే దీనిని ‘ఎర్ర బంగారం’ అని పిలుస్తారు.
అధిక ధర, డిమాండ్ కారణంగా స్మగ్లర్లు ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది.
నాణ్యతను బట్టి ఎర్రచందనం ధర మారుతుంది. ఏ-గ్రేడ్ ఎర్రచందనం టన్నుకు సుమారు రూ.75 లక్షల వరకు ధర పలికినట్లు మార్కెట్ నివేదికలు చెబుతున్నాయి. గతంలో అత్యుత్తమ నాణ్యత కలిగిన దుంగలకు కిలోకు రూ.1,950 వరకు ధర లభించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

