
భారీ వాహనాల ఫిట్‌నెస్ తనిఖీలను మరింత కఠినతరం చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నిబంధనల ప్రకారం వాహనాల వెనుక భాగంలో రిఫ్లెక్టివ్ టేపులు, అవసరమైన లైట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
వాహనాల పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల (ATS) ద్వారా వాహనాల సాంకేతిక సామర్థ్యం, భద్రతా ప్రమాణాలను పరీక్షిస్తున్నట్లు తెలిపారు.
2025లో రాష్ట్రవ్యాప్తంగా 2,44,604 వాహనాలను తనిఖీ చేయగా, 2026 జూలై వరకు మరో 1,04,543 వాహనాలను పరీక్షించినట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేయడం లేదని తెలిపారు.
24 ATS కేంద్రాల్లో 49 పరీక్షలు
రాష్ట్రంలోని 24 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో వాహనాల ఫిట్‌నెస్ పునరుద్ధరణ సందర్భంగా ఒక్కో వాహనంపై మొత్తం 49 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో 30 విజువల్, 19 ఫంక్షనల్ పరీక్షలు ఉంటాయని చెప్పారు.
వాహనం బాహ్య పరిస్థితి, లైట్లు, బ్రేకులు, ఇతర కీలక భద్రతా అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. పరీక్షల్లో లోపాలు గుర్తిస్తే వెంటనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేయకుండా తిరస్కరిస్తున్నట్లు వివరించారు. లోపాలను సరిచేసిన తర్వాత మళ్లీ పరీక్షలకు హాజరై, నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
రాత్రి వేళల్లో భారీ వాహనాలు ఇతర వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ టేపులు, వెనుక లైట్ల ఏర్పాటు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావులేకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.

