
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎంపికైన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రామ్ మాధవ్‌లకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన.. రాజకీయ, ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఇద్దరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు.
బీజేపీని జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేయడంలో పురంధేశ్వరి, రామ్ మాధవ్‌ల అనుభవం, సామర్థ్యం కీలకంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అదేవిధంగా బీజేపీ జాతీయ స్థాయిలోని అన్ని విభాగాలకు సంయుక్త సమన్వయకర్తగా ఎంపికైన విష్ణువర్ధన్ రెడ్డికి కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు.
బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో వివిధ బాధ్యతలు పొందిన ప్రతి ఒక్కరికీ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.
ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజాసేవ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నూతన జాతీయ కార్యవర్గం సమష్టిగా పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

