
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సంఘాల ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో హోమ్‌స్టేలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పర్యాటకులు, భక్తులకు తక్కువ ఖర్చుతో వసతి, భోజనం అందించడంతోపాటు మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పర్యాటక ప్రాంతాల్లో హోమ్‌స్టేలు
రాష్ట్రంలోని ఆలయాలు, పర్యాటక ప్రాంతాలకు ఏడాది పొడవునా భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. వారికి స్థానికంగా అందుబాటులో ఉన్న ఇళ్లలో సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు హోమ్‌స్టేలను ప్రోత్సహిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి, గోదావరి పుష్కరాల వంటి సందర్భాల్లో వీటికి మంచి డిమాండ్ ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణ
పర్యాటక శాఖ, పట్టణ మహిళా సంఘాలు (మెప్మా) కలిసి ఆయా పట్టణాల్లో హోమ్‌స్టేలను గుర్తించనున్నాయి. అతిథులకు వసతితో పాటు స్థానిక ప్రాంతాలు, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేలా నిర్వాహకులకు శిక్షణ ఇస్తారు.
ముఖ్య నిబంధనలు
హోమ్‌స్టేలో కనిష్ఠంగా ఒక బెడ్రూమ్, రెండు పడకలు.. గరిష్ఠంగా ఆరు గదులు, 12 బెడ్లు ఉండాలి. ఇంటి యజమాని తన కుటుంబంతో అదే ప్రాంతంలో నివసించాలి. అతిథులకు అవసరమైన సేవలు అందించేందుకు ఒక ప్రతినిధిని అందుబాటులో ఉంచాలి.
దరఖాస్తుదారుల ఇళ్లను అధికారులు పరిశీలించడంతోపాటు వారి సత్ప్రవర్తనను కూడా తనిఖీ చేస్తారు. ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు. దరఖాస్తు సమయంలో ఐదు రకాల డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది.
ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరాల కోసం సమీపంలోని మెప్మా అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.

