
పెళ్లకూరు మండలంలో వైసీపీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు వైసీపీ నాయకులు పోరాటం కొనసాగిస్తారని స్పష్టం చేశారు.
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 20న పునబాక గ్రామంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య జరిగిన వివాదంలో 27 మంది వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
కేవలం వైసీపీ నాయకులపైనే కేసులు నమోదు చేసి, టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోకపోవడం పోలీసుల పనితీరుకు నిదర్శనమని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కేసులు, అరెస్టులతో వైసీపీ నాయకులను అడ్డుకోలేరని కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి అన్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా వైసీపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు.

