
వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ పరిహారాన్ని అందించింది. శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు నిర్వాసిత కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారం చెక్కును అందజేశారు.
తాజాగా విడుదల చేసిన రూ.250 కోట్లతో కలిపి ఇప్పటివరకు వెలిగొండ నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం మొత్తం రూ.768 కోట్ల పరిహారం అందించినట్లు తెలిపింది. భూములు, ఇళ్లు కోల్పోయిన కుటుంబాల పునరావాసం, పునరావాస ప్యాకేజీల చెల్లింపులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లాలోని కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీటి లభ్యత మెరుగుపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల పరిహారం, పునరావాస ప్రక్రియను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

