
మార్కాపురం జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)-2026లో భాగంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. విజయ సునీత తెలిపారు.
ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్ స్థాయి అధికారులు (BLOలు) అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా, ASD జాబితాలను పరిశీలించుకోవచ్చన్నారు.
ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులు, ముఖ్యంగా 18–19 ఏళ్ల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కొత్త ఓటరు నమోదుకు ఫారం-6, అనర్హులు, మరణించిన లేదా వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపునకు ఫారం-7, పేరు, చిరునామా, ఫొటో, వయస్సు తదితర వివరాల సవరణకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో BLOలతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో తమ వివరాలను పరిశీలించుకుని, అవసరమైన మార్పులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

