
విజయవాడ: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 24వ డివిజన్లో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వం పెన్షన్ పెంపునకు ఐదేళ్లు తీసుకుంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంపు హామీని అమలు చేసిందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు నేరుగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
త్వరలో 40 వేల మందికి ఇళ్ల పట్టాలు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు మరో కీలక హామీని అమలు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని కేశినేని చిన్ని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియోజకవర్గంలో 40 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్న ఎంపీ.. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, అధికారులు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
