
పాకిస్థాన్‌లో అపహరణకు గురై బలవంతంగా ఇస్లాం మతంలోకి మారిన ఒక హిందూ యువతికి స్థానిక న్యాయస్థానంలో ఊరట లభించింది. సింధ్ ప్రావిన్స్‌కు చెందిన 21 ఏళ్ల శిరిమాతి రీటాను కిడ్నాప్ చేసిన దుండగులు పంజాబ్‌లోని గుర్జాన్వాలాకు తరలించి.. బలవంతంగా మతమార్పిడి చేయించారు. అక్కడితే ఆగకుండా అప్పటికే పెళ్లయిన ఓ ముస్లిం యువకుడితో బలవంతంగా వివాహం జరిపించారు. ఈ దారుణంపై విచారణ జరిపిన పోలీసులు బాధితురాలిని రక్షించి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఆమెను వెంటనే తిరిగి కన్నవారి వద్దకు పంపాలని ఆదేశిస్తూ కీలక తీర్పు ఇచ్చారు.
పాకిస్థాన్‌లో ఎవరూ ఊహించని ఓ ఘోరం జరిగిపోయింది. ముఖ్యంగా ఓ హిందూ యువతిని కిడ్నాప్ చేసిన కొందరు దుండగులు.. బలవంతంగా ఆమెను ఇస్లాంలోకి మార్చారు. ఆపై అప్పటికే పెళ్లయిన ఓ యువకుడితో వివాహం జరిపించారు. అయితే ఈ కేసు కాస్తా కోర్టుకు వెళ్లగా.. న్యాయస్థానం బాధితురాలికి ఉపశమనాన్ని కల్గించింది. సదరు హిందూ యువతిని తిరిగి ఆమె కన్నవారి వద్దకే చేర్చాలని సంచలన తీర్పును ఇచ్చింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
అసలేం జరిగిందంటే..?
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్ సంఘర్ జిల్లా ఖిప్రో తాలుకా రాణా రాజ్‌పుత్ కాలనీకి చెందిన 21 ఏళ్ల శిరిమాతి రీటా గత వారం అకస్మాత్తుగా అదృశ్యమైంది. తన చెల్లెలు కనిపించడం లేదంటూ ఆమె సోదరుడు శంకర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవి ఫుటేజీ చూడగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కొందరు వ్యక్తులు రీటాతో పాటు ఆమె వద్ద ఉన్న విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కుని తమతో పాటు తీసుకువెళ్లినట్లు రికార్డయింది. ఆ కిడ్నాపర్లు రీటాను సింధ్ ప్రాంతం నుంచి పంజాబ్ ప్రావిన్స్‌లోని గుర్జాన్వాలాకు తీసుకువెళ్లారు. అక్కడే ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చి, ఇస్లాం మతంలోకి బలవంతంగా మార్పిడి చేయించారు. అంతేకాకుండా అప్పటికే వివాహమై భార్య ఉన్న నజీర్ హుస్సేన్ అనే ముస్లిం యువకుడితో ఆమెకు అయిష్టంగానే బలవంతపు పెళ్లి జరిపించారు.
