
తమిళనాడు ప్రభుత్వ పరిపాలనా కేంద్రమైన చారిత్రాత్మక ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుంచి శాసనసభ, సచివాలయాన్ని తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పరిమిత స్థలం కారణంగా ప్రస్తుత ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ విభాగాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం కష్టంగా మారడంతో.. ఒకే ప్రాంగణంలో శాసనసభ, సచివాలయం సహా అన్ని సదుపాయాలు ఉండేలా నూతన సమీకృత పరిపాలనా సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే రూల్ 110 కింద ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఈ కీలక నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కొత్త సమీకృత భవనాల నిర్మాణానికి అనువైన స్థలాల కోసం అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. గిండి, నందంబాక్కమ్‌తో పాటు మరో రెండు ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. స్థల ఎంపిక పూర్తయిన అనంతరం కొత్త పరిపాలనా సముదాయ నిర్మాణంపై ప్రభుత్వం తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది.
తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా కేంద్రంగా, చట్టసభల వేదికగా దశాబ్దాలుగా సేవలందిస్తున్న చారిత్రాత్మక ‘ఫోర్ట్ సెయింట్ జార్జ్’ కోట నుంచి శాసనసభ, సచివాలయాన్ని తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుత ప్రాంగణంలో స్థలాభావం కారణంగా.. శాసనసభ, సచివాలయం సహా అన్ని ప్రభుత్వ విభాగాలకు అవసరమైన సదుపాయాలు ఒకే చోట అందుబాటులో ఉండేలా నూతన సమీకృత పరిపాలనా కాంప్లెక్స్‌ను నిర్మించాలనే ఆలోచనలో సీఎం విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే రూల్ 110 కింద ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎలాంటి చర్చ లేకుండానే ప్రభుత్వం నేరుగా నిర్ణయాన్ని ప్రకటించనుండటం తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లోని ప్రధాన భవనంలో అసెంబ్లీతో పాటు ముఖ్యమంత్రి, పలువురు మంత్రుల కార్యాలయాలు కొనసాగుతున్నాయి. అయితే కార్యాలయాల కోసం తగినంత స్థలం లేకపోవడంతో బీసీ, ఎంబీసీ, కార్మిక సంక్షేమ శాఖలకు చెందిన మంత్రుల కార్యాలయాలను ప్రస్తుతం గ్యారేజ్ బ్లాక్‌లో నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తాత్కాలికంగా ఫోర్ట్ ప్రాంగణంలోని నామక్కల్ కవిజ్ఞర్ మాళిగై 10వ అంతస్తుకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే దీర్ఘకాలిక పరిష్కారం కోసం కొత్త ప్రదేశంలో శాశ్వతంగా ముఖ్యమంత్రి కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఇందులో భాగంగా గిండిలోని హైవేస్ రీసెర్చ్ స్టేషన్ క్యాంపస్‌లో ఉన్న 35 ఎకరాలు, పట్టినాపక్కమ్/ఫోర్‌షోర్ ఎస్టేట్‌లోని 20 ఎకరాలు, అలాగే నందంబాక్కమ్‌లో ఫిన్‌టెక్ సిటీకి ఎదురుగా ఉన్న సుమారు 20 ఎకరాల స్థలాలను ఎంపిక కమిటీ పరిశీలిస్తోంది.
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) మంత్రి ఆదవ్ అర్జున ఆదేశాల మేరకు రెవెన్యూ, పీడబ్ల్యూడీ శాఖలకు చెందిన అధికారులు ఇప్పటికే ఆయా ప్రదేశాలను స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఈ స్థలాల్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసి, శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది.
