
గుంటూరులో మూడు నెలలుగా కనిపించకుండా పోయిన 15 ఏళ్ల బాలిక మిస్సింగ్ కేసుపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ బాలిక ఆచూకీని గుర్తించలేకపోవడంపై గుంటూరు పోలీసుల తీరును తప్పుబట్టింది. బాలికను గురువారంలోగా కోర్టు ముందు హాజరుపరచాలని డీజీపీని ఆదేశించింది.
బాలిక తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. పదో తరగతి చదువుతున్న తన కుమార్తె ట్యూషన్‌కు వెళ్లి తిరిగి రాలేదని జూన్ 9న పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. షేక్ జాన్ సైదా అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ద్వారా బాలికకు పరిచయమై, ఆమెను ట్రాప్ చేసి తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మూడు నెలలు గడిచినా బాలిక ఆచూకీ లభించకపోవడంతో తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ సందర్భంగా పోలీసుల దర్యాప్తు తీరుపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. బాలికను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారని వ్యాఖ్యానించింది. ఈ మేరకు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ జి. తుహిన్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది డీవీ శశిధర్ వాదిస్తూ.. నిందితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోలీసులకు సవాల్ చేసినప్పటికీ అతడిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని తెలిపారు. బాలిక ఇంటి నుంచి 200 గ్రాముల బంగారం, రూ.లక్ష తీసుకెళ్లినట్లు కూడా పిటిషనర్ పేర్కొన్నారు.
కేసులో బాలిక ఆచూకీని వెంటనే గుర్తించి కోర్టు ముందు హాజరుపరచాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది.
