గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం మాయం కేసు కొలిక్కి వచ్చింది. మంగళసూత్రం చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పెదకాకాని పాతూరుకు చెందిన కొండవీటి రణధీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయ శాశ్వత అర్చకులకు సహాయకుడిగా రణధీర్‌ పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

శ్రావణమాసం సందర్భంగా ఆగస్టు 14న అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. రెండు రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పించిన అనంతరం.. ఆగస్టు 18న అమ్మవారి మంగళసూత్రం కనిపించకపోవడాన్ని అర్చకులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో గోగినేని లీలాకుమార్‌కు తెలియజేయడంతో ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఆలయానికి వచ్చిపోయే వారిని విచారించారు. ఈ క్రమంలో రణధీర్‌ను కూడా ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదని చెప్పినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.

అనంతరం రణధీర్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. బెడ్‌రూమ్‌లో పరుపును తొలగించి తనిఖీ చేస్తుండగా.. రెండు మంచాల మధ్య మంగళసూత్రం లభ్యమైందని పోలీసులు వెల్లడించారు. దీనిపై రణధీర్‌ను ప్రశ్నించగా తానే తీసుకున్నట్లు అంగీకరించినట్లు తెలిపారు.

రణధీర్ తల్లిని కూడా పోలీసులు విచారించగా.. తన కుమారుడు మంగళసూత్రాన్ని కొప్పురావూరు ఆలయం నుంచి తీసుకొచ్చాడని, అది నకిలీ బంగారమని చెప్పినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *