
అమరావతి: ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సస్పెండ్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చింది. వీరిద్దరిపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే వారిని తిరిగి సర్వీసులోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
2004 బ్యాచ్‌కు చెందిన కాంతి రాణా టాటా, 2010 బ్యాచ్‌కు చెందిన విశాల్ గున్నీలు గతంలో జత్వానీ కేసు నేపథ్యంలో సస్పెన్షన్‌కు గురయ్యారు. సస్పెన్షన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశాన్ని సమీక్షించి తాజా నిర్ణయం తీసుకుంది. డీజీపీ సమర్పించిన నివేదికలతో పాటు కాంతి రాణా టాటా ఆగస్టు 24న సమర్పించిన వినతిపత్రాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
అయితే సస్పెన్షన్ ఎత్తివేసినంత మాత్రాన ఇద్దరు అధికారులపై ఉన్న ఆరోపణలు, కేసులు ముగిసినట్లు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వారిపై కొనసాగుతున్న శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు, క్రిమినల్ కేసులపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదని తెలిపింది. జత్వానీ కేసుకు సంబంధించిన దర్యాప్తు, న్యాయపరమైన ప్రక్రియలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు త్వరలో పోస్టింగ్‌లు కేటాయించే అవకాశం ఉంది. ఇద్దరు అధికారులకు సస్పెన్షన్ ఎత్తివేత ఉత్తర్వుల ప్రతులను అందజేసి, వారి నుంచి రసీదులు తీసుకోవాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది.
