
నందిగామ బీజేపీ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. నందిగామ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సేవాభావంతో ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. 1984 లోక్సభ ఎన్నికల్లో రెండు స్థానాలతో ప్రారంభమైన బీజేపీ.. నేడు 303 స్థానాలకు చేరుకోవడం అసాధారణ రాజకీయ ప్రస్థానమన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.
నందిగామ బీజేపీ నేతలు, కార్యకర్తల సమిష్టి కృషితోనే పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగలిగామని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో సుజనా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ ఎదిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని, ప్రతి గ్రామం, వార్డు స్థాయికి పార్టీని విస్తరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నం గిరిధర్, పోరుగంటి నరసింహారావు, కొల్లు నాగేశ్వరరావు, బర్రె శివకృష్ణారెడ్డి, సీతారామయ్య, రావూరి రమేష్, బండారు వెంకట నాగ కేదారేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.
