
విజయదశమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. దసరాకు పార్టీని ప్రకటించనున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణతో పాటు కొత్త పార్టీకి సంబంధించిన పలు అంశాలను వెల్లడించారు.
కొత్త పార్టీ ఏపీకే పరిమితం అవుతుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ, టీడీపీలు తనకు శత్రువులు కాదని.. కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనన్నారు. తాను స్థాపించే పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా ఉండబోనని స్పష్టం చేశారు. రెడ్లు, కమ్మ సామాజికవర్గాలకు చెందిన వారే సీఎం కావాలా అని ప్రశ్నించిన ఆయన.. సామర్థ్యం ఉన్న వ్యక్తే తమ పార్టీ సీఎం అభ్యర్థిగా ఉంటారని తెలిపారు. తాను మాత్రం వెనుక ఉండి పార్టీని నడిపిస్తానన్నారు.
తన పాత్ర బాల్ థాకరే తరహాలో మెంటర్‌గా ఉంటుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తాను, తన కుటుంబ సభ్యులు ఎలాంటి పదవులు చేపట్టబోమని స్పష్టం చేశారు. గత 15 ఏళ్లుగా ఏపీ రాజకీయాలు టీడీపీ, వైసీపీల చుట్టూనే తిరుగుతున్నాయని.. ఈ రెండు పార్టీల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని అభిప్రాయపడ్డారు.
అమరావతిపై కీలక వ్యాఖ్యలు
తాను రాజకీయంగా సైలెంట్‌గా లేనని చెప్పిన విజయసాయిరెడ్డి.. ఏడాది పాటు పరిశోధన చేసి ‘రెడ్డి’ సామాజికవర్గం ఆవిర్భావంపై సుమారు 350 పేజీల పుస్తకం రాసినట్లు వెల్లడించారు. రాజధాని అమరావతికి తాను వ్యతిరేకం కాదని.. ఇష్టం ఉన్నా లేకపోయినా అమరావతికి మద్దతు ఇవ్వాల్సిందేనన్నారు. అమరావతి అభివృద్ధికి ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించాలని, ప్రభుత్వ నిధులు వృథా కాకుండా చూడాలని సూచించారు.
యువతకు 66 శాతం పదవులు
కొత్త పార్టీలో 66 శాతం పదవులను యువతకే కేటాయిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్టీని 15 శాతానికి తగ్గిస్తామని హామీ ఇచ్చారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అనుమానాలను నివృత్తి చేసేందుకు సంబంధిత కేసులను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
దసరా నాటికి కొత్త పార్టీ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో మరో ప్రత్యామ్నాయ వేదికను తీసుకురావడమే లక్ష్యంగా విజయసాయిరెడ్డి ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
