అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన ప్రత్యేకంగా చర్చించారు. కూటమి పార్టీల మధ్య సఖ్యత కొనసాగించాలని, పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదని స్పష్టం చేశారు.

మహిళా రిజర్వేషన్లలో పోటీ చేసే అభ్యర్థులను ముందుగానే గుర్తించాలని.. సమర్థవంతమైన మహిళా నేతలకు అవకాశం కల్పించాలని చంద్రబాబు సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలను పరిష్కరించామని, ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని చెప్పారు. ఆ సానుకూలత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కనిపించాలని ఆకాంక్షించారు.

2029 అసెంబ్లీ ఎన్నికల్లో 2024 కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపుపైనే తన దృష్టి మొత్తం ఉందని తెలిపారు. పరిపాలనతో పాటు పార్టీ కార్యక్రమాలకు కూడా ప్రతిరోజూ సమయం కేటాయిస్తున్నానని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలకు 25 ప్రాధాన్యతాంశాలు

అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో స్పష్టమైన లక్ష్యాలతో పనిచేయాలని సూచించారు.

ప్రతి నియోజకవర్గంలో 25 ప్రాధాన్యతాంశాలను గుర్తించి, వాటికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇలా పనిచేస్తే ప్రజల్లో గుర్తింపు, గౌరవం లభిస్తుందని అన్నారు.

ప్రతి మూడు నెలలకు లీడర్‌షిప్ సమావేశం

ఇకపై టీడీపీ లీడర్‌షిప్ సమావేశాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను తదుపరి సమావేశంలో ప్రదర్శించాలని సూచించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *