అమరావతి, సెప్టెంబర్ 7: చైనా మాస్టర్స్ 2026లో ఛాంపియన్లుగా నిలిచిన భారత స్టార్ షట్లర్లు సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఇరువురు.. భారత జోడీకి అభినందనలు తెలిపారు.

చైనా మాస్టర్స్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలిచిన తొలి భారత జోడీగా సాత్విక్-చిరాగ్ చరిత్ర సృష్టించారని చంద్రబాబు పేర్కొన్నారు. షెన్‌జెన్‌లో సాధించిన ఈ విజయం భారత బ్యాడ్మింటన్‌కు చారిత్రక ఘట్టమని అభివర్ణించారు. సాత్విక్‌సాయిరాజ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్‌ను కూడా సీఎం అభినందించారు. ప్రపంచ వేదికపై మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

భారత బ్యాడ్మింటన్‌కు గర్వకారణం: పవన్

చైనా జోడీపై అద్భుతమైన పునరాగమన విజయంతో సాత్విక్-చిరాగ్ భారత్‌కు చారిత్రక టైటిల్ అందించారని పవన్ కల్యాణ్ కొనియాడారు. హీ జి టింగ్–రెన్ షియాంగ్ యూ జోడీపై 11-21, 21-13, 21-17తో విజయం సాధించారని తెలిపారు.

పోరాట పటిమ, ఆత్మవిశ్వాసంతో సాత్విక్-చిరాగ్ అద్భుత విజయం సాధించారని పవన్ ప్రశంసించారు. చైనా మాస్టర్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయులుగా నిలిచిన ఈ జోడీ.. భారత బ్యాడ్మింటన్‌కు గర్వకారణమని పేర్కొంటూ అభినందనలు తెలిపారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *