
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన టెన్యూర్లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (MCLR)ను గరిష్ఠంగా 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. సవరించిన రేట్లు 2026 సెప్టెంబర్ 7 నుంచే అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది.
MCLR తగ్గడంతో ఈ రేటుకు అనుసంధానమైన రుణాలపై వడ్డీ భారం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్లోటింగ్ రేట్ రుణాలు తీసుకున్న కస్టమర్లు బ్యాంకును సంప్రదించి EMI తగ్గించుకోవడం లేదా రుణ కాలపరిమితిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
కొత్త MCLR రేట్లు ఇవే
MCLR సవరణ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రేట్లు టెన్యూర్‌ను బట్టి 7.90 శాతం నుంచి 8.60 శాతం మధ్య ఉన్నాయి. గతంలో ఇవి 8 శాతం నుంచి 8.65 శాతం వరకు ఉండేవి.
- ఓవర్‌నైట్, 1 నెల – 8% నుంచి 7.90%
- 3 నెలలు – 8.15% నుంచి 8.05%
- 6 నెలలు – 8.30% నుంచి 8.25%
- 1 సంవత్సరం – 8.40% నుంచి 8.35%
- 2 సంవత్సరాలు – 8.55% నుంచి 8.45%
- 3 సంవత్సరాలు – 8.65% నుంచి 8.60%
చాలా కన్జూమర్ లోన్ల వడ్డీ రేట్లు ఏడాది టెన్యూర్ MCLRతో అనుసంధానమై ఉంటాయి. దీంతో ఈ విభాగంలోని రుణగ్రహీతలకు తాజా నిర్ణయం కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది.
MCLR అంటే ఏమిటి?
బ్యాంకులు రుణాలు మంజూరు చేసే కనీస వడ్డీ రేటును MCLRగా పిలుస్తారు. బ్యాంకుల రుణ వడ్డీ రేట్లలో పారదర్శకత తీసుకురావడంతో పాటు, వివిధ బ్యాంకుల మధ్య ఏకరీతి విధానం ఉండేలా RBI ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బేస్ రేట్ 8.70 శాతం కాగా, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (BPLR) 17.20 శాతంగా ఉంది.
ఇదిలా ఉంటే, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 2.75 శాతం నుంచి 6.50 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ రేట్లు అందిస్తోంది.
