ఏపీలో ఆశా వర్కర్ ఉద్యోగాలు.. 913 పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1,294 పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో 913 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ నెల 30వ తేదీలోగా నియామక ప్రక్రియను ప్రారంభించి, నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఈ పోస్టులకు స్థానిక మహిళలు, ముఖ్యంగా సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన వారు అర్హులు. 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి కాగా, 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఎంపికైన ఆశా వర్కర్లకు నెలకు రూ.10,000 గౌరవ వేతనం అందుతుంది. ఇందులో రూ.8,320 రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.

ప్రాంతాల వారీగా పోస్టులు

  • గ్రామీణ ప్రాంతాలు – 673
  • గిరిజన ప్రాంతాలు – 64
  • పట్టణ ప్రాంతాలు – 176
  • మొత్తం – 913 పోస్టులు

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీల ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. ఈ నెల 30లోగా నియామకాల జాబితాను పంపించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాల వారీగా ఖాళీలు

అనకాపల్లి 77, కర్నూలు 65, తూర్పుగోదావరి 44, అల్లూరి సీతారామరాజు 43, పార్వతీపురం మన్యం 43, పశ్చిమగోదావరి 42, అన్నమయ్య 41, ప్రకాశం 38, కడప 38, కృష్ణా 37, విశాఖపట్నం 33, చిత్తూరు 32, కోనసీమ 32, పల్నాడు 31, విజయనగరం 31, కాకినాడ 29, నెల్లూరు 29, ఏలూరు 27, అనంతపురం 26, మార్కాపురం 25, శ్రీ సత్యసాయి 22, శ్రీకాకుళం 22, గుంటూరు 21, నంద్యాల 21, పోలవరం 21, తిరుపతి 21, ఎన్టీఆర్ 15, బాపట్ల 7 పోస్టులు ఉన్నాయి.

అర్హత ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలను చేరువ చేయడంలో ఆశా వర్కర్లు కీలకంగా పనిచేస్తున్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *