
ఏపీలో అధికార కూటమిలో భాగమైన టీడీపీ, జనసేన మధ్య సోషల్ మీడియాలో కొనసాగుతున్న వివాదాలపై రెండు పార్టీలు స్పందించాయి. కార్యకర్తలు పరస్పరం విమర్శలు, అనుచిత పోస్టులు చేయకుండా సంయమనం పాటించాలని సూచించాయి. ముఖ్యంగా నేతలు, వారి కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేశాయి.
జనసేన కార్యకర్తల పేరుతో చంద్రబాబు, నారా లోకేష్, వారి కుటుంబ సభ్యులపై.. టీడీపీ కార్యకర్తల పేరుతో పవన్ కళ్యాణ్, జనసేన నేతలపై అనుచిత పోస్టులు వస్తున్నాయని ఇరు పార్టీలు పేర్కొన్నాయి. ఇలాంటి చర్యలు కూటమి ఐక్యతను దెబ్బతీస్తాయని హెచ్చరించాయి.
వ్యక్తిగత కోపాలు, ఆవేశంతో సోషల్ మీడియాలో పోస్టులు చేయకుండా పార్టీ ఆదేశాలను పాటించాలని టీడీపీ సూచించింది. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలపై బాధ్యతారహితమైన పోస్టులు ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని తెలిపింది.
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి శ్రేణులు కలిసి పనిచేయాల్సిన సమయం అని గుర్తుచేస్తూ.. ‘మన మధ్య మనమే పోరాడకుండా, ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థిపై దృష్టి పెట్టాలి’ అని సూచించింది.
ఎన్టీఆర్‌పై కొందరు జనసైనికులు, చిరంజీవిపై కొందరు టీడీపీ కార్యకర్తలు చేస్తున్న వ్యాఖ్యలపైనా పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఏదైనా సమస్య ఉంటే సోషల్ మీడియాలో బహిరంగ విమర్శలు చేయకుండా పార్టీ నాయకత్వం లేదా సోషల్ మీడియా విభాగం దృష్టికి తీసుకురావాలని కోరాయి.
కూటమి ఐక్యత, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత అని స్పష్టం చేశాయి.
