ముంబయిలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనాల్సిన కార్యక్రమానికి ముందు భద్రతా కలకలం చోటుచేసుకుంది. నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో జరుగుతున్న కార్యక్రమానికి ఇద్దరు వ్యక్తులు నకిలీ గుర్తింపు కార్డులతో ప్రవేశించారు. తాము ప్రధాని కార్యాలయానికి చెందిన అధికారులమంటూ వారు నకిలీ ఐడీ కార్డులు చూపించినట్లు అధికారులు గుర్తించారు.

అంతేకాకుండా, వారి వద్ద తుపాకీ కూడా ఉండటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. ప్రధాని మోదీ రాకకు కొద్ది గంటల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడంతో భద్రతా వ్యవస్థలో కలకలం రేగింది. అనంతరం పోలీసులు నిందితులను క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు. ప్రస్తుతం వారి వివరాలు, నకిలీ ఐడీ కార్డులు, తుపాకీతో ప్రాంగణంలోకి ప్రవేశించిన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

మోదీ కార్యక్రమం వద్ద తుపాకీతో ఇద్దరి అరెస్ట్.. నకిలీ PMO ఐడీలతో కలకలం

ముంబయిలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనాల్సిన కార్యక్రమ ప్రాంగణంలో తుపాకీ, నకిలీ ప్రధానమంత్రి కార్యాలయం (PMO) గుర్తింపు కార్డులతో సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో భద్రతా వర్గాల్లో ఆందోళన నెలకొంది. వారి వద్ద నుంచి ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు.

బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో ప్రధాని మోదీ పాల్గొనాల్సిన కార్యక్రమానికి కొన్ని గంటల ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాంగణంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని, తుపాకీతో ఉన్న అతని బాడీగార్డ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో ఆ వ్యక్తిని 24 ఏళ్ల రోహన్ పరేఖ్‌గా గుర్తించారు. తాను ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన అధికారినని అతడు చెప్పుకున్నప్పటికీ, తనిఖీల్లో అతడి వద్ద ఉన్న PMO గుర్తింపు కార్డు నకిలీదిగా తేలింది. అతడి వెంట ఉన్న బాడీగార్డ్ వద్ద నుంచి తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాని రాకకు కొద్ది గంటల ముందే ఈ అరెస్టులు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కార్యక్రమ ప్రాంగణంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

మంగళవారం సాయంత్రం NMACC వేదికగా నిర్వహించనున్న ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్’ (GFF)ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల మధ్య నకిలీ PMO ఐడీలతో ఇద్దరు వ్యక్తులు తుపాకీతో పట్టుబడటం కలకలం రేపింది.

నకిలీ ఐడీలతో పాటు తుపాకీని తీసుకుని సభ ప్రాంగణంలోకి వారిద్దరూ ఎందుకు ప్రవేశించారనే విషయాన్ని తెలుసుకునేందుకు ముంబయి పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని ప్రశ్నించడంతో పాటు వారి మొబైల్ ఫోన్లు, గుర్తింపు కార్డులు, ఇతర వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విచారణ పూర్తయిన అనంతరం అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని, దాని ఆధారంగా వారిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *