తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ తనను అనుకరిస్తూ చేసిన దవడ సంజ్ఞపై మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. “తమ్ముడు విజయ్.. నీకు చరిత్ర తెలియదు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఎమర్జెన్సీ సమయంలో జైలులో ఉన్న తనపై పోలీసులు జరిపిన దాడిలోనే దవడ ఎముకలు విరిగాయని స్టాలిన్ గుర్తు చేశారు. తమిళుల హక్కుల కోసం డీఎంకే తీవ్రంగా పోరాడిందని, ఆ పోరాటంలో పార్టీ నేతలు ఎన్నో గాయాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

డీఎంకే చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకోకుండా తనను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని స్టాలిన్ హితవు పలికారు. ముందుగా చరిత్రను పూర్తిగా తెలుసుకుని, ఆ తర్వాత మాట్లాడితే మంచిదని విజయ్‌కు సూచించారు.

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సంజ్ఞ తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైంది. శాసనసభలో డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సమయంలో.. మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను అనుకరిస్తూ విజయ్ తన దవడను పైకెత్తుతూ సంజ్ఞ చేశారు. ఈ చర్య స్టాలిన్‌ను బాడీ షేమింగ్ చేయడమేనంటూ డీఎంకే నేతలు, పార్టీ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివాదం ముదరడంతో సీఎం విజయ్ దీనిపై వివరణ ఇచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ సంజ్ఞ చేయలేదని, ప్రసంగంలో భాగంగా అనుకోకుండా అలా జరిగిందని స్పష్టం చేశారు. అయితే విజయ్ వివరణ ఇచ్చినప్పటికీ ఈ వ్యవహారం మాత్రం సద్దుమణగలేదు.

తాజాగా ఈ వివాదంపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నేరుగా స్పందించారు. ఎక్స్ వేదికగా వీడియో సందేశాన్ని విడుదల చేసిన స్టాలిన్.. విజయ్‌కు అత్యంత ఘాటుగా సమాధానం ఇచ్చారు. తన దవడకు సంబంధించిన ఆ సంజ్ఞ వెనుక ఉన్న చరిత్రను గుర్తుచేస్తూ విజయ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సెప్టెంబర్ 7న తమిళనాడు అసెంబ్లీలో అవినీతి అంశంపై మాట్లాడుతున్న సమయంలో సీఎం విజయ్ చేసిన దవడ సంజ్ఞ వివాదానికి దారితీసింది. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. ఎక్స్ వేదికగా ఓ సంచలన వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

“తమ్ముడు విజయ్..” అంటూ ప్రారంభించిన స్టాలిన్.. విజయ్‌కు పలు విషయాలను గుర్తుచేశారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ కాలంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను ప్రస్తావించారు.

1975-77 మధ్య దేశంలో అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో.. అప్పటి ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం రద్దయిందని స్టాలిన్ తెలిపారు. ఆ సమయంలో డీఎంకే యువజన విభాగానికి నాయకత్వం వహిస్తున్న తనను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు.

అరెస్టు అనంతరం జైలులో పోలీసులు తమపై తీవ్రంగా దాడి చేసి, చిత్రహింసలకు గురిచేశారని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఎదురైన దారుణమైన అనుభవాల కారణంగానే తన దవడ ఎముకలు విరిగిపోయాయని గుర్తుచేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *