వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) టీడీపీలో చేరడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టత ఇచ్చారు. స్థానిక టీడీపీ నాయకత్వం అంగీకారం తీసుకున్న తర్వాతే చిన్న శ్రీనును పార్టీలోకి చేర్చుకున్నామని తెలిపారు.

విశాఖపట్నంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన పల్లా శ్రీనివాసరావు.. పార్టీలోకి ఎవరైనా చేరాలంటే స్థానిక నాయకత్వం అభిప్రాయాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలు, నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సముద్రంలో నదులు కలవవు.. నదులే సముద్రంలో కలవాలి” అంటూ.. పార్టీలో చేరేవారు టీడీపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు సాగాల్సిందేనని పేర్కొన్నారు.

మరోవైపు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా పల్లా శ్రీనివాసరావు స్పందించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి చర్చించిన తర్వాతే సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు.

ముందుగా జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించి, అనంతరం అసెంబ్లీ స్థాయి సమావేశాలు చేపడతామని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీంతో బీసీలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక మిత్రపక్షాల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *