ఘంటసాల మండల రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిమ్మగడ్డ లాకుల నుంచి మండలానికి పూర్తిస్థాయిలో సాగునీరు అందక పంట పొలాలు నెర్రలు బారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ నుంచి నీటిని విడుదల చేసినప్పటికీ ప్రస్తుతం శివారు ప్రాంతాలకు సరిపడా నీరు అందడం లేదని చెబుతున్నారు.

ముఖ్యంగా చిలకలపూడి, వి.రుద్రవరం గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో నాట్లు వేయలేని పరిస్థితి నెలకొంది. ఎల్‌నినో ప్రభావంతో పాటు సాగునీటి కొరత తమను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని రైతులు అంటున్నారు. మండలంలోని 3/2 కాలువ శివారు ప్రాంతాలకు నీరు చేరకపోవడంతో పొలాలు బీటలు వారుతున్నాయని తెలిపారు.

3/2 చానల్‌తో పాటు 4, 5 నంబర్ల కాలువల కింద ఉన్న ఆయకట్టుకు కూడా పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదని రైతులు చెబుతున్నారు. దీంతో సాగు పనులు ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు నిమ్మగడ్డ లాకుల నుంచి దిగువన ఉన్న దివిసీమ ప్రాంతంలోని చెరువులకు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ ఘంటసాల మండలానికి మాత్రం పూర్తిస్థాయిలో నీరు అందకపోవడంపై రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ ఆయకట్టుకు నీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ దిగువ ప్రాంతాలకు అధికంగా నీటిని విడుదల చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆరుగాలం శ్రమించి పంటలు పండించే తమ సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఓట్ల సమయంలో మాత్రమే మమ్మల్ని గుర్తు చేసుకుంటారా?” అంటూ నేతలను ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విక్కుర్తి శ్రీనివాసరావు స్పందించి ఘంటసాల మండలంలోని ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

By Ramya