ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సుకు వివిధ దేశాల అధ్యక్షులు హాజరవుతున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా భారత్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భద్రతకు సంబంధించిన అంశాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ముఖ్యంగా పుతిన్‌ ప్రయాణించే ప్రత్యేక విమానం ‘డూమ్స్‌డే ప్లేన్‌’, అలాగే ఆయన వినియోగించే అత్యంత భద్రమైన ‘ఆరస్‌ సెనత్‌’ కారు గురించి చర్చ జరుగుతోంది. రష్యా అధ్యక్షుడి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ విమానం, కారులో అనేక ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వినియోగించే అధికారిక కారుకు కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అగ్ర దేశాల అధినేతల భద్రత కోసం ఉపయోగించే ఈ వాహనాలు, ప్రత్యేక రక్షణ వ్యవస్థలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

మన దేశ రాజధాని ఢిల్లీ బ్రిక్స్‌ సదస్సుకు వేదికగా మారింది. ఈ కీలక సమావేశానికి దేశ, విదేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు తరలివస్తున్నారు. వారిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా ఉన్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు.

దాదాపు 25 ఏళ్లుగా రష్యా రాజకీయాలను శాసిస్తున్న పుతిన్‌కు ప్రపంచవ్యాప్తంగా మిత్రులతో పాటు శత్రువులు కూడా ఉన్నారు. దీంతో ఆయన భారత్‌ పర్యటన ప్రారంభమైనప్పటి నుంచి పుతిన్‌ భద్రతపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఆయన ప్రయాణించే విమానం, వినియోగించే కారుపైనే అందరి దృష్టి పడింది.

పుతిన్‌ రష్యా నుంచి భారత్‌కు అత్యంత భద్రతా ప్రమాణాలతో రూపొందించిన ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. ఈ విమానాన్ని సాధారణంగా ‘డూమ్స్‌డే ప్లేన్‌’గా పిలుస్తారు. రష్యా నుంచి ఒకే తరహాకు చెందిన రెండు ఇల్యూషిన్‌ ఐఎల్‌-96-300 పీయూ విమానాలు ఒకేసారి బయలుదేరడం ఈ ప్రయాణంలో ప్రత్యేకతగా నిలిచింది.

అయితే ఆ రెండు విమానాల్లో పుతిన్‌ ఏ విమానంలో ప్రయాణిస్తున్నారనే విషయం ముందుగా ఎవరికీ తెలియదు. శత్రువుల నుంచి ఎదురయ్యే ముప్పును దృష్టిలో ఉంచుకుని ఇలాంటి వ్యూహాత్మక ఏర్పాట్లు చేస్తారు. అత్యాధునిక భద్రతా వ్యవస్థలు, ప్రత్యేక కమ్యూనికేషన్‌ సదుపాయాలతో తీర్చిదిద్దిన ఈ విమానాన్ని ‘ఫ్లయింగ్‌ క్రెమ్లిన్‌’ అని కూడా పిలుస్తారు.

పుతిన్‌ పర్యటనలో ఆయన ప్రయాణించే వాహనాల భద్రత కూడా అంతే కీలకం. అందుకే ఢిల్లీలో ఆయన కోసం ఉపయోగించనున్న ప్రత్యేక కారు కూడా ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పుతిన్‌ భద్రత కోసం ఉపయోగించే ప్రత్యేక విమానం అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన మొబైల్‌ కమాండ్‌ సెంటర్‌గా పేరుగాంచింది. ఈ విమానంలో నాలుగు ఇంజిన్లు ఉంటాయి. ఒక్కసారి ఇంధనం నింపితే దాదాపు 11 వేల కిలోమీటర్ల దూరం వరకు నిరంతరాయంగా ప్రయాణించగలదని సమాచారం. 1980ల కాలంలో దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ విమానం సుమారు 55.35 మీటర్ల పొడవు ఉంటుంది.

ఇందులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమ్యూనికేషన్‌ వ్యవస్థల ద్వారా ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా పూర్తి స్థాయి మొబైల్‌ కమాండ్‌ సెంటర్‌గా పనిచేయగల సామర్థ్యం ఉందని చెబుతున్నారు. రాడార్‌ జామింగ్‌ టెక్నాలజీతో పాటు అధునాతన రక్షణ వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. సురక్షితమైన సమాచార ప్రసారాన్ని కొనసాగించేందుకు శాటిలైట్‌ లింకులు, రేడియో, డేటా కమ్యూనికేషన్‌ ఛానళ్లను కూడా ఈ విమానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఇక పుతిన్‌ కోసం అత్యున్నత భద్రతా ప్రమాణాలతో తయారు చేసిన మరో ప్రత్యేక వాహనం ‘ఆరస్‌ సేనత్‌’. ఇది ఒక లగ్జరీ లిమోజీన్‌ కారు. విదేశీ పర్యటనల్లోనూ పుతిన్‌ తన సొంత ఆరస్‌ సేనత్‌లోనే ప్రయాణిస్తారని సమాచారం. అత్యంత పటిష్ఠమైన భద్రతా ఫీచర్ల కారణంగా దీనిని ‘చక్రాలపై కోట’గా అభివర్ణిస్తుంటారు. ఈ వాహనం బుల్లెట్‌ప్రూఫ్‌ రక్షణతో రూపొందించబడింది.

సోవియట్‌ కాలం నాటి ZIS-110 లిమోజీన్‌ నుంచి స్ఫూర్తి పొంది ఆరస్‌ సేనత్‌ను అభివృద్ధి చేసినట్లు చెబుతున్నారు. ఈ కారు సుమారు 563 సెంటీమీటర్ల పొడవు, 200 సెంటీమీటర్ల వెడల్పు, 170 సెంటీమీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది. 4.4 లీటర్ల ట్విన్‌-టర్బోచార్జ్డ్‌ V8 ఇంజిన్‌తో నడిచే ఈ కారు కేవలం 9 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని సమాచారం. దీని ధర సుమారు రూ.2.5 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *