
ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ వద్ద పీఏగా పనిచేస్తున్న చందన్ సింగ్ జీనా నివాసాలపై ఈడీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. 2016 నాటి నియామక పరీక్షల కుంభకోణానికి సంబంధించిన కేసులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ సోదాల్లో రూ.32 లక్షల నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలు, ఖరీదైన లగ్జరీ వాచ్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
కేసు ప్రభావం కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేక పోరాటంపై పడకూడదనే ఉద్దేశంతో హరీశ్ రావత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన సీడబ్ల్యూసీ, పీసీసీ పదవులకు సంచలన రీతిలో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత హరీష్ రావత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన వ్యక్తిగత సహాయకుడి (పీఏ) నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించిన మరుసటి రోజే రావత్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
తన పీఏపై వచ్చిన అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణల ప్రభావం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠపై పడకూడదనే ఉద్దేశంతో హరీష్ రావత్ శుక్రవారం తన పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శాశ్వత ఆహ్వానితుడి పదవితో పాటు ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ఎగ్జిక్యూటివ్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదా చెడ్డపేరు రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రావత్ స్పష్టం చేశారు.
ఉత్తరాఖండ్ సబోర్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ (యూకేఎస్ఎస్ఎస్సీ) 2016లో నిర్వహించిన గ్రామ పంచాయతీ వికాస్ అధికారి నియామక పరీక్షలో జరిగిన అక్రమాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
ఈ కేసులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం హరీష్ రావత్ వద్ద ప్రస్తుతం వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న చందన్ సింగ్ జీనా నివాసంపై ఈడీ గురువారం సోదాలు నిర్వహించింది. గతంలో 2014-2017 మధ్య హరీష్ రావత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీనా ఓఎస్డీగా కూడా పనిచేశారు. డెహ్రాడూన్లోని జీనా నివాసంతో పాటు పలు కీలక ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
సోదాల్లో జీనా నివాసం నుంచి రూ.32 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మొత్తం 200.5 గ్రాముల బరువున్న 13 వెండి, బంగారు నాణేలు, ఏడు బంగారు గొలుసులు లభించాయి. వీటితో పాటు రోలెక్స్, రాడో, టిస్సోట్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన 12 ఖరీదైన లగ్జరీ వాచ్లను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అదనంగా, జీనా మరియు ఆయన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.52.16 లక్షల నిధులను కూడా ఈడీ సీజ్ చేసింది. ఈ స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తులు, ఇతర విలువైన వస్తువులపై అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
