
తమిళనాడులోని మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయ పశ్చిమ గోపురం సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 86 ఏళ్ల పురాతన సెంట్రల్ థియేటర్లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి అసలు కారణం, జరిగిన నష్టం తదితర పూర్తి వివరాలు అధికారుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
తమిళనాడులోని మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమ్మవారి ఆలయ పశ్చిమ గోపురానికి సమీపంలో ఉన్న సెంట్రల్ థియేటర్లో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా పొగలు కనిపించి, కాసేపటికే భారీగా మంటలు చెలరేగాయి.
కొన్ని రోజులుగా మూసి ఉన్న ఈ థియేటర్‌ను ప్రస్తుతం పార్కింగ్ సౌకర్యంగా, పిల్లల బొమ్మలను నిల్వ చేసే గోడౌన్‌గా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్లో అకస్మాత్తుగా పొగలు రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. చూస్తుండగానే మంటలు వేగంగా వ్యాపించి భవనం మొత్తాన్ని చుట్టుముట్టాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
నిమిషాల వ్యవధిలోనే దట్టమైన పొగ సమీపంలోని వీధుల్లోకి వ్యాపించడంతో ఆలయ ప్రాంతంలో భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మీనాక్షి సుందరేశ్వర ఆలయ కుంభాభిషేకం సందర్భంగా సమీపంలో యాగశాల కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో భక్తులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. అయితే దట్టమైన పొగతో పాటు మంటలు వేగంగా వ్యాపించడంతో వాటిని అదుపు చేయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
దాదాపు రెండు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, రాత్రి పొద్దుపోయే వరకు సహాయక చర్యలు కొనసాగాయి. ప్రాథమికంగా సుమారు 60 శాతం మంటలను మాత్రమే అదుపులోకి తీసుకురాగలిగినట్లు సమాచారం.
ప్రస్తుతం పార్కింగ్ కోసం వినియోగిస్తున్న ఈ థియేటర్లో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ సామగ్రి కూడా నిల్వ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అగ్నిప్రమాదానికి అసలు కారణం దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
