బ్రిక్స్‌ సదస్సులో పాల్గొని స్వదేశానికి తిరిగి వెళ్లిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామాఫోసా అనారోగ్యానికి గురయ్యారు. వైద్యుల సూచన మేరకు ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. కోలుకునే వరకు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది.

73 ఏళ్ల రామాఫోసా సోమవారం న్యూఢిల్లీ నుంచి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లిన అనంతరం అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఎన్ని రోజులు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటారనే విషయాన్ని అధ్యక్ష కార్యాలయం వెల్లడించలేదు. ఇప్పటికే నిర్ణయించిన కార్యక్రమాల్లో తన స్థానంలో కేబినెట్‌ సహచరులు పాల్గొనాలని ఆయన సూచించారు.

ఇదిలా ఉండగా.. బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఢిల్లీలో స్ట్రోక్‌కు గురయ్యారంటూ సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాపించాయి. ఆయన ప్రత్యేక విమానంలో చైనాకు వెళ్లి చికిత్స పొందుతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బ్రిక్స్‌ సదస్సుకు హాజరైన పలువురు ప్రపంచ నేతలు అనారోగ్యానికి గురయ్యారంటూ తప్పుడు ప్రచారం మొదలైనట్లు సమాచారం.

మరోవైపు దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్‌ మషాటిలే కూడా ఇటీవల శస్త్రచికిత్స చేయించుకోవడంతో వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరూ అందుబాటులో లేని పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో దక్షిణాఫ్రికా ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి రొనాల్డ్‌ లమోలా నేతృత్వం వహించనున్నట్లు దక్షిణాఫ్రికా బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ తెలిపింది.

కాగా, శ్వేతజాతీయులపై వివక్షకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో అమెరికా, దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటికే దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా ఆరోపణలను దక్షిణాఫ్రికా ఖండిస్తూ.. వర్ణవివక్ష కారణంగా ఏర్పడిన అసమానతలను సరిదిద్దేందుకు తమకు తగిన విధానాలు రూపొందించే హక్కు ఉందని స్పష్టం చేసింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *