
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం ఉదయం శ్రీమలయప్పస్వామివారు కోదండరాముడి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా.. భక్తుల భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారు మాడవీధుల్లో విహరించారు. స్వామివారి వాహన సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
కొనసాగుతున్న భక్తుల రద్దీ
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయని టీటీడీ అధికారులు తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు సుమారు 8 గంటల్లో సర్వదర్శనం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
శనివారం శ్రీవారిని 83,589 మంది భక్తులు దర్శించుకోగా.. 27,828 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.17 కోట్ల ఆదాయం లభించింది. అదే రోజు 4.77 లక్షల లడ్డూలు విక్రయించగా.. 7.04 లక్షల మందికి అన్నప్రసాదం అందించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
