తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వినాయక నిమజ్జన వేడుకలు విషాదంగా మారుతున్నాయి. నిమజ్జన ఊరేగింపుల్లో ఉత్సాహంగా పాల్గొన్న పలువురు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో నిమజ్జన వేడుకల్లో డీజేల వినియోగం, అధిక శబ్దంపై చర్చ మొదలైంది.

నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో శనివారం జరిగిన గణేష్ శోభాయాత్రలో రాము (34) డ్యాన్స్ చేసిన అనంతరం ఇంటి వద్ద మెట్లపై కూర్చున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోనూ శనివారం విషాదం చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జన ఊరేగింపులో డ్యాన్స్ చేస్తుండగా కాకర్లమూడి ఈసు ఒక్కసారిగా కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు సమాచారం.

కర్నూలు రూరల్ మండలం ఇ.తాండ్రపాడులో శుక్రవారం నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న శివమ్మ (36) డ్యాన్స్ చేసిన అనంతరం అస్వస్థతకు గురై కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నంద్యాల జిల్లా డోన్‌లో గణేశ్ గౌడ్ (23) నిమజ్జనం అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు సమాచారం.

అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో శ్రీకాంత్ (35), అనంతపురం జిల్లా గుత్తిలో అశోక్ కుమార్ (28) కూడా నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న సమయంలో కుప్పకూలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రికి తరలించేలోపే వారు మృతి చెందినట్లు సమాచారం.

వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో డీజే శబ్దాలపై చర్చ జరుగుతోంది. అయితే అధిక శబ్దమే గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్‌కు ప్రత్యక్ష కారణమని నిర్ధారించాలంటే వైద్య పరీక్షలు, పోస్టుమార్టం నివేదికలు, వ్యక్తుల గత ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.

అయితే అధిక శబ్దానికి ఎక్కువసేపు గురికావడం ఆరోగ్యానికి హానికరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచిస్తోంది. WHO సేఫ్ లిజనింగ్ మార్గదర్శకాల ప్రకారం శబ్ద తీవ్రత పెరిగే కొద్దీ సురక్షితమైన వినికిడి సమయం తగ్గుతుంది. పెద్ద ఈవెంట్లలో శబ్ద స్థాయిని పర్యవేక్షించడం, శబ్దాన్ని కొలిచే పరికరాలు వినియోగించడం, అవసరమైన వారికి వినికిడి రక్షణ కల్పించడం వంటి జాగ్రత్తలు సూచించింది.

ఇలాంటి ఘటనల నేపథ్యంలో నిమజ్జన ఊరేగింపుల్లో భద్రతా చర్యలు, అధిక శబ్ద నియంత్రణపై అధికారులు, నిర్వాహకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఉండి నియోజకవర్గంలో డీజేలకు అనుమతి లేదని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పష్టం చేసినట్లు సమాచారం.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *